పవన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాని మోస్తున్నారు

సనాతన ధర్మం అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ అజెండా చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

Update: 2024-10-08 12:25 GMT

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ అధికారంలోకి వచ్చి ఉపముఖ్యమంత్రి అయిన తరువాత సనాతన ధర్మం గురించి మాట్లాడం, రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదని చెప్పటం ఆశ్చర్యంగా ఉందన్నారు.

త్రివిక్రమ్‌ సినిమాల్లో పాత్రకి తగినట్లు ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్‌ ఉంటుందని, ఆలాగే అధికారంలోకి వచ్చిన తరువాత సినిమాల్లో మాదిరిగా పవన్‌ వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, మజ్లీస్‌ పార్టీలంటే అవి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలని ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు. జనసేన లౌకిక పార్టీ అని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లౌకికవాదులే అన్నారు. అణగారిన కులాలను, వెనుకబడిన వర్గాలను, మహిళలను కించపర్చే విధానం సనాతన ధర్మంలో ఉంటుందన్నారు. జనసేన పార్టీలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. ఈ నేపధ్యంలో జనసేన అధినేత వైఖరిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సరిదిద్దాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Tags:    

Similar News