'ఉల్లిపాయ పొట్టూ' తీయలేవని పవన్ ను తిట్టిన ఆ విజయసాయేనా ఈయన..
పవన్ ను'పావలా' అన్న విజయసాయి రెడ్డి ఇప్పడేంటి ఇలా...
By : The Federal
Update: 2025-11-23 11:52 GMT
ఉల్లిపాయ మీద పొట్టూ తీయలేవని పవన్ ను తిట్టిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడన్నారు. పవన్ ను తాను ఎన్నడూ ఒక్కమాట అనలేదని అన్నారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు చంద్రబాబుకు ఎటువంటి వైరం లేదని అన్నారు. అలాగే పవన్ కల్యాణ్ తనకు 20 ఏళ్లుగా మంచి మిత్రుడని, ఆనాటి నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతుందని చెప్పారు. పవన్ ను తాను ఎన్నడూ ఒక్క మాట అనలేదని స్పష్టం చేశారు.
అయితే పవన్ పై ఆయన ఏడాది కిందట కూడా అనేక విమర్శలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలపుడు పవన్ కల్యాణ్ ను విజయసాయి రెడ్డి చాలా తీవ్రంగానే విమర్శించారు.
ఆనాడు వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టావు' అంటూ పవన్‍పై విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు.
'అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కి తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు’ అని 2019, 2024 ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
‘ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు’ అని ఆసమయంలో మరో ట్వీట్‍లో విమర్శించారు.
ఇప్పుడేమో తనకూ పవన్ కల్యాణ్ కు 20 ఏళ్ల స్నేహం ఉందంటున్నారు. దీనిపై డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలని జనసేన నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. నిబద్ధత లేని వారి మాటలు విన వద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు ఆయన రెడ్డి హితవు పలికారు.
తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని.. కానీ ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఏదీ లేదన్నారు. అవసరమైతే తానే ఒక పార్టీ పెట్టడానికి సైతం వెనకాడబోనని అన్నారు. విపరీతమైన ఒత్తిడి వచ్చినా తాను ఎవరికీ లొంగ లేదన్నారు.
చాలా మంది తనపై చాలా సెటైర్లు వేస్తున్నారని.. ఎవరూ ఎన్ని అనుకున్నా తాను ప్రస్తుతం రైతును మాత్రమేనని, శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చను తానే భరిస్తానని తెలిపారు.
రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ పేరుతో జిల్లాలు ఉన్నాయని.. కానీ సైరా నరసింహరెడ్గి పేరుతో జిల్లా లేదని గుర్తు చేశారు. కర్నూలు జిల్లాకు సైరా నరసింహరెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచించారు.