తమిళనాడు తీరుపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్
హిందీ వద్దంటూ తమిళ సినిమాలను డబ్ చేస్తారా? డబ్బులు కావాలి గాని హిందీ భాష వద్దా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.;
By : The Federal
Update: 2025-03-15 03:07 GMT
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ఎన్డీఏ భాగస్వామి పవన్ కల్యాణ్ తమిళనాడు భాషా విధానాన్ని, హిందీ భాషపై ఉన్న వ్యతిరేకతను తప్పుబట్టారు. హిందీ భాషను తిరస్కరిస్తున్నప్పుడు తమిళ సినిమాలను ఎందుకు హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి హిందీ మాట్లాడే ప్రాంతాల్లో లాభాలు పొందేందుకు కాదా అని నిలదీశారు. తమిళ సినిమాలను హిందీలో అనువదించి సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. మన దగ్గర పని చేయడానికి హిందీ మాట్లాడే ఉత్తరాది కార్మికులు కావాలి గాని హిందీ భాష మాత్రం వద్దా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పెరియార్ నాయకర్ ఉద్యమాన్ని పరోక్షంగా తప్పుబట్టినట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే..
"త్రిభాషా వాదన సరికాదు.. భారతదేశానికి బహుభాషలే కావాలి. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? ఇదేం న్యాయం? ఏ రాష్ట్రంలోని ముస్లింలైనా అరబిక్‌లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దనే మాటే అనరు. హిందువులు మాత్రం దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదవొద్దంటారు. అందుకే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు.. నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి. అంతే తప్ప రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవటం ఏంటి? వివేకం, ఆలోచన ఉండొద్దా?’ అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు.
‘ఉత్తర, దక్షిణ భారతదేశమంటూ చర్చలు పెడుతున్నారు. ఉత్తరాది వాళ్లు తెల్లగా ఉంటారు. మేం దక్షిణాది వాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడొద్దు. రాజకీయ వైరుధ్యాలు సహజం. ఆ నెపంతో దేశాన్ని ముక్కలు చేయొద్దు. దక్షిణాదికి చెందిన సెంగోల్.. ఉత్తరాదిన ఉన్న పార్లమెంట్‌లో ఉంది. దీని అర్థ్ధం వైరుధ్యమొస్తే విడిపోవాలని కాదు. కలిసి పరిష్కారం వెతుక్కోవాలని. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం. 14 ఏళ్ల వయసులో తమిళనాడులో పెరిగినప్పుడు నేనూ వివక్ష అనుభవించా. తెలుగును రివర్స్‌లో గుల్టీ అంటూ అభ్యంతరకరంగా పిలిచేవారు. ద్రవిడ ఉద్యమ రూపకర్త పెరియార్.. రాయలసీమలోని బలిజ నాయుడు. భాషది ఏముంది? దాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసం చేయాలనే ఆలోచన సరికాదు’ అని అన్నారు.
భాషల మధ్య సౌహార్ద్రత అవసరమన్నారు. భాషల పట్ల ద్వేషం పెంచుకోవడం వివేకహీనమన్నారు.ముస్లింలు ఎక్కడ ఉన్నా అరబీ లేదా ఉర్దూలో నమాజ్ చేయడం, అలాగే దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు పఠించడం లాంటివి సాధారణంగా జరుగుతాయని చెప్పారు. అలా అయితే, ఈ ప్రార్థనలు తమిళం లేదా తెలుగు భాషల్లోనే చేయాలా? అని ప్రశ్నించారు.
దేశం ఐక్యత, సమగ్రతను ప్రాధాన్యంగా పెట్టుకోవాలని, ఉత్తర-దక్షిణ విభజనలను అధిగమించాలని ఆయన సూచించారు. ప్రజలు నిజంగా దేశానికి మేలు చేసే రాజకీయ పార్టీని ఎంచుకోవాలని, దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలని సూచించారు.
ప్రస్తుతం భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో భాషా రాజకీయాలు వివాదాస్పద అంశంగా ఉన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"భిన్న భాషలు మన దేశానికి మేలే. ఈ సిద్ధాంతం తమిళనాడుకూ వర్తించాలి. తమిళనాడులో కూడా మాకు రాజకీయ మద్దతుదారులు ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మా పార్టీకి మద్దతు ఉంది. నా తెలుగు ప్రసంగాలను తమిళ ప్రజలు ఆసక్తిగా వినిపిస్తున్నారని తెలుసుకున్నాను. తమిళ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వివిధ సిద్ధాంతాలను స్వీకరించే హక్కు ఉంటుందని, ప్రస్తుతానికి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం తాను నేర్చుకున్న హక్కు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. 14 ఏళ్ల వయస్సు నుండి ప్రతి ఏడాది ఉపవాస దీక్షలు పాటిస్తున్నానని చెప్పారు. సనాతన ధర్మంపై తనకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
219 ఆలయాల్లో దాడులు జరిగినా, తాను ఆందోళనకు దిగలేదని పేర్కొంటూ, ముహమ్మద్ ప్రవక్త, అల్లాహ్, క్రైస్ట్ లేదా మదర్ మేరీని అవమానించడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? అని ప్రశ్నించారు.
రాముడు, శివుడు, పార్వతీ, అయ్యప్పలను అవమానించినప్పుడు మేము మౌనంగా ఉండాలా? అని ప్రశ్నిస్తూ, వివిధ మతాలకు వేర్వేరు న్యాయ ప్రమాణాలు ఉండలేవన్నారు. ధర్మం అందరికీ ఒక్కటేనని తెలిపారు. మన పాలకులు మసీదులు, చర్చిలను నిర్మించారని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే దేశం నుంచి విడిపోతామని.. తెలంగాణ ఇవ్వకపోతే దేశంలో ఉండబోమని ప్రకటనలు చేసిన నాయకుల్ని అప్పట్లో చూశాం. ఎవరికీ కోపం వస్తే వారు కోసుకోవడానికి భారతదేశం ఏమైనా కేకు ముక్కా? దేశ సమగ్రతను విధ్వంసం చేయటానికి ఒక్కరుంటే.. దాన్ని కాపాడటానికి నాలాంటివాళ్లు 10 కోట్ల మంది రోడ్లపైకొస్తారు. దేశం కోసం చనిపోవటానికీ నేను సిద్ధమే. జనసేన అనే శిశువు.. తనను తాను కాపాడుకోగలిగే వరకూ మనం ఈ బిడ్డను కాపాడితే అది పెద్దదై సమాజాన్ని కాపాడుతుంది. దేశాన్ని రక్షిస్తుంది. అందుకే ఈ బిడ్డను.. కంటికి రెప్పలా కాపాడుకుందామని శపథం చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, గద్దర్, తన వెన్నంటి నిలిచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు, నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ లాంటి వాళ్లకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.