ఎన్నికల సంఘంపై పోరుకు ఏకమైన పార్టీలు
ఎన్నికల ప్రచారాలకు అనుమతులు తప్పని సరి అని ఏపీ సీఈఓ మీనా చెప్పారు. ఈ షరతులపై పార్టీలన్నీ ఒక్కటై వ్యతిరేక స్వరం వినిపించాయి. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటి..
ఎన్నికలంటేనే సభలు, రోడ్ షోలు, గడపగడపకు ప్రచారం, ప్రసంగాలతో అంతా హడావుడిగా ఉంటుంది. అన్ని పార్టీలు తమ ప్రత్యర్థుల కన్నా ఒక అడుగు ముందు ఉండడానికి చూస్తుంటాయి. ఇందులో భాగంగా ఎప్పుడూ కనిపించని నేత కూడా ఎన్నికలప్పుడు వీధుల్లోకి వచ్చి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తమకే ఓటేయాలని కోరుతుంటారు. కొందరు నేతలు టీ కొట్టడం, ఇస్త్రీ చేయడం, ఆటో నడపడం లాంటివి చేస్తుంటారు. వీటితో పాటు ర్యాలీ మాదిరిగా తమ వాహనాల్లో మైక్‌సెట్లు పెట్టుకుని ప్రజలను పలకరిస్తూ తాము చేసే అభివృద్ధిని, అందించే సంక్షేమాన్ని వివరిస్తూ ఎటు చూసినా తమ పార్టీ పోస్టర్లు, కటౌట్‌లే కనిపిస్తున్నా ప్రతి ఒక్కరికీ పాంప్లేట్లు పంచుతూ వెళ్తుంటారు.
కానీ ఈసారి ఎన్నికల్లో ఈ హడావుడి ఉండేలా కనిపించట్లేదు. ఇందుకు తాజాగా ఈసీ అమలు చేస్తున్న తాజా నిబంధనలే కారణం. ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టర్లు, కటౌట్‌లను అధికారులు తొలగించేస్తున్నారు. తాజాగా అభ్యర్థులు చేసే ప్రచారంపై కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. వీటికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపించాయి. ఇదెక్కడి విడ్డూరమంటూ ప్రశ్నించాయి.
ఈసీ పెట్టిన నిబంధన
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పార్టీలు అన్నీ కూడా ఎటువంటి సమావేశం నిర్వహించాలన్నా, ర్యాలీలు చేయాలన్నా, కరపత్రాలు పంచాలన్నా, ఇంటింటికీ ప్రచారం చేయాలన్నా అనుమతులు తప్పనిసరి అని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా. ‘‘తమ ప్రచారానికి సంబంధించి పార్టీల అభ్యర్థులు అందరూ 48 గంటల ముందు అనుమతులు తీసుకోవాలి. ర్యాలీలు చేయాలన్నా, మైక్‌సెట్‌లు పెట్టాలన్నా, ర్యాలీ చేసే వాహనానికి పోస్టర్లు, కటౌట్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నా అనుమతులు తప్పక ఉండాలి. వీటి కోసం సువిధ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే 24 గంటల ముందు రిటర్నింగ్ అధికారి దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు తప్పనిసరిగా 48 గంటల ముందే అప్లై చేసుకోవాలి. 48 గంటల లోపు జరిగే ప్రచారానికి ఆన్‌లైన్ ద్వారా అనుమతులు ఇవ్వబడవు. ఈ అనుమతులు అసెంబ్లీ అభ్యర్థికి అయితే అభ్యర్థి వాహనంతో పాటు అతని ఏజెంట్ వాహనానికి అనుమతి ఇస్తాం. లోక్‌సభ పోటీదారు అయితే వారి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్తలు లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఇస్తాం’’అని స్పష్టం చేశారు మీనా. అంతేకాకుండా ఈ వాహనాల్లో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులే ఉండాలని చెప్పారు. ఈ అంశంపై ఎన్నికల అధికారులు అన్ని పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు.
పార్టీలన్నిటిదీ ఒకే స్వరం
ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన ఈ నిబంధనలపై అన్ని పార్టీల నేతలు ఒకే స్వరం వినిపించారు. ఇదెక్కడి విడ్డూరమంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవాలా అనుమతుల కోసం ఎన్నికల అధికారుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనల్లో సవరణలు తీసుకురావాలని కోరారు. ఎన్నికలంటేనే ప్రచారం ప్రధానంగా ఉంటుందని, దానిపై షరతులు పెట్టడం అన్యాయమని కొందరు తెలిపారు. ఇంటింటికి ప్రచారం చేయడానికి కూడా అనుమతులు తీసుకోవడం తమ రాజకీయ కెరీర్‌లో ఎన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత నెల డిసెంబర్‌లో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, వాటిలో తెలంగాణ కూడా ఒకటని, అప్పుడు ఈ నిబంధనలు ఎందుకు పెట్టలేదని ఎన్నికల అధికారులను పార్టీ నేతలంతా ముక్తకంఠంతో ప్రశ్నించారు. ఈ నిబంధనలపై అధికారులు మరోసారి పునఃపరిశీలన చేయాలని వారు కోరారు. కాగా వారు చెప్పిన అంశాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
ఆంక్షలు లేకుండా అనుమతించాలి: సీపీఐ(ఎం)
ఈ సమీక్ష సమావేశానికి సీపీఐ(ఎం) పార్టీ తరపున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కే హరి కిషోర్ హాజరయ్యారు. 48 గంటల ముందు అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలను పునఃపరిశీలించాలని వారు కోరారు. ‘‘మేడే కార్యక్రమాలు నిర్వహించడానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతులు ఇవ్వాలి. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు, జెండా పోల్స్‌ను తొలగించకుండా అధికారులను ఆదేశించాలి. కర్నూలు, రాజమండ్రిలో జెండా పోల్స్, దిమ్మలు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇతర జిల్లాల్లో ఇలా జరగకుండా ఆదేశాలు జారీ చేయాలి. 2019లో మాదిరిగా బైండోవర్ పేరిట అభ్యర్థులను స్టేషన్‌లకు పిలిపించి ఇబ్బందులు పెట్టకూడదు’’అని వారు తెలిపారు.