ఏపీ పాలిటిక్స్‌లో ఫొటో మంట.. వివాదానికి ఆలోచనా విధానమే కారణమా..

ఏపీలో ప్రస్తుతం ఫొటో రాజకీయాలు జోరందుకున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం కూడా ఇప్పుడు ఫొటో వార్‌గా మారింది.

Update: 2024-09-14 12:22 GMT

ఏపీలో ప్రస్తుతం ఫొటో రాజకీయాలు జోరందుకున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం కూడా ఇప్పుడు ఫొటో వార్‌గా మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులకు గౌరవమే లేదంటూ వైసీపీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక ఫొటో ఈ సరికొత్త వివాదానికి దారి తీసింది. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఈ ఫొటో వార్ ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు. కానీ దీనిపై ప్రజల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. ఇన్ని రోజులు వరదల చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్తగా ఏపీ మంత్రులు, వారి గౌరవం వైపు మళ్లింది. ఎదురుగా నలుగురు మంత్రులు ఉన్నప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌పీ సిసోడియా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఫొటోనే ఏపీ రాజకీయాలను మలుపుతిప్పాయి. ఈ ఫొటోను షేర్ చేస్తూనే వైసీపీ.. ‘బాబు పాలనలో మంత్రుల పరిస్థితి ఇది’ అంటూ రాసుకొచ్చింది. దీనికి టీడీపీ నుంచి కూడా అదే తరహా రిప్లైలు వస్తున్నాయి. జగన్ ఇంటి బయట ఆనాటి నేతలు వేచి చూస్తున్న ఫొటోలను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ.. జగన్ పాలనతో నేతల దుస్థితి ఇది అంటూ ఘాటు సమాధానాలు ఇస్తున్నారు. ఇది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారే అవకశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

అసలేంటా ఫొటో..

వైసీపీ షేర్ చేసిన ఫొటోలో హోం మంత్రి వంగలపూడి అనిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి రెవెన్యూ, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిసోడియా.. వరదల నష్టంపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆర్పీ సిసోడియా.. మంత్రుల ముందే కాలుపై కాలు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోనే వైసీపీ షేర్ చేసింది. కూటమి ప్రభుత్వ మంత్రులకు దక్కుతున్న గౌరవం ఇదేనంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. దీనిపై స్పందించిన టీడీపీ శ్రేణులు కూడా ఇదే తరహా ఫొటోను ఒకటి షేర్ చేశాయి.




 

కాలుపై కాలు వేసుకోవడం తప్పా..

మంత్రుల ముందు కాలుపై కాలు వేసుకోవడం తప్పా అంటే అదేమీ కాదని అంటున్నారు పలువురు నిపుణులు. కాలుపై కాలు వేసుకోవడం అనేది వ్యక్తిగత విషయమే అవుతుందని వివరిస్తున్నారు. కాకపోతే మనం ఎదుటి వారికిగానీ, వారి పదవులకు కానీ గౌరవం ఇస్తున్నట్లు తెలియజేయడానికి కాలుపై కాలు వేసుకోకుండా ఉంటేమే తప్ప మరేమీ లేదు. దీనికి సంబంధించిన రూల్స్ కూడా ఏమీ లేదు. పలు దేశాల్లో దేశ ప్రధానులు, అధ్యక్షులు ముందరే చిన్నచిన్న అధికారులు సైతం కాలుపై కాలు వేసుకుని సంభాషిస్తారు. ఇది కేవలం మన ఆలోచనా తీరులో తప్పుగా తోస్తుందే తప్ప.. అందులో రగడ చేయాల్సిన అంశం ఏమీ లేదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇచ్చే శిక్షణలో ఒక విధమైన యాటిట్యూడ్ శిక్షణ కూడా ఉంటుందని, అందులో భాగంగా ఇలా కాలుపై కాలు వేసుకోవడం వంటి మరిన్ని అంశాలను నేర్పుతారని కూడా మరికొందరు చెప్తున్నారు. ఏది ఏమైనా మంత్రుల ముందు కాలుపై కాలు వేసుకోవడం తప్పు అని చెప్పడానికి ఎటువంటి నిబంధన లేదు.. ఇది కేవలం మన ఆలోచన తీరుకు నిదర్శనం మాత్రమే అవుతుంది.

ఫొటోపై వస్తున్న మిశ్రమ స్పందన

ఇదెలా ఉంటే ఈ ఫొటోల వ్యవహారంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రులు అంటే ప్రజల చేత ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకోబడిన వారని, వారికి అధికారులు గౌరవం ఇవ్వాల్సిందేనని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇందులో పెద్ద సమస్య ఏమీ లేదని, అక్కడ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి వివరిస్తూ అలవాటు ప్రకారమే సిసోడియా కాలుపై కాలు వేసుకున్నారే తప్ప.. ఎవరినీ అవమానించాలని కాదని, అయినా కాలుపై కాలు వేసుకోవడం తప్పు కాదని వారిస్తున్నారు.

Tags:    

Similar News