నూరేళ్లు నిండేనాటికైనా పోలవరం పూర్తయ్యేనా?

ఈ తరం ఆశలు వదులుకోవాల్సిందేనా? పోలవరం జాప్యానికి కారణాలేంటీ,..

Update: 2025-12-24 06:26 GMT
ఏఐ గ్రాఫిక్స్- పోలవరం ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిధుల సుడిగుండంలో చిక్కుకుంది. నిజానికి పోలవరం అనేది ఒక ప్రాజెక్టు కాదు, అది దశాబ్దాల కల. అందువల్లే రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 1941లో మెుదటిసారిగా దీని గురించి ప్రతిపాదన వచ్చింది. మరో 15 ఏళ్లలో ఈ నినాదం తెరపైకి వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. అంటే ఇప్పటికి 85 ఏళ్లుగా ఈ సమస్య నానుతూనే ఉంది. ఎడతెగకుండా సాగుతూనే ఉంది. పాలకులు మారుతున్నారే తప్ప ప్రాజెక్ట్ పూర్తి కావడం లేదన్నది రైతుల ఆవేదన. ప్రస్తుత పరిస్థితులు, సాంకేతిక అంశాలు, నిధుల సమీకరణను విశ్లేషిస్తే.. పోలవరం పూర్తి కావడానికి ఉన్న అవకాశాలు, అడ్డంకులు ఇలా ఉన్నాయి.

2005లో కేవలం ₹10,151 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం, కాలయాపన వల్ల నేడు ₹62,436 కోట్లకు చేరింది. అంటే దాదాపు 6 రెట్లు పెరిగింది. మరి ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ శతాబ్దంలోనైనా ప్రాజెక్టు పూర్తి అవుతుందా? అని ది ఫెడరల్ ప్రతినిధులు మాట్లాడిన రైతు నాయకులు కేవీవీ ప్రసాద్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పి.రవి, జమలయ్య తదితరులు అనుమానం వ్యక్తం చేశారు. వారి చెప్పిన అంశాల ఆధారంగా తెరపైకి వచ్చే అంశాలు ఇలా ఉన్నాయి.
ఎందుకీ కాలయాపన?
ప్రాజెక్టు ప్రారంభంలో అంచనాలు తక్కువగా ఉన్నా, భూసేకరణ, పునరావాసం (R&R), పెరిగిన మెటీరియల్ కాస్ట్స్ వల్ల వ్యయం కొండలా పెరిగిపోయింది.
తొలి దశ (+41.15 మీటర్లు): దీని కోసం కేంద్రం ₹30,436.95 కోట్లు మంజూరు చేసింది.
రెండో దశ (+45.72 మీటర్లు): పూర్తిస్థాయిలో నీటిని నిలపాలంటే మరో ₹32,000 కోట్లు కావాలి.
శాపంగా మారిన డయాఫ్రమ్ వాల్...
కేవలం నిధులు, భూసేకరణ మాత్రమే కాదు.. అనాలోచిత నిర్ణయాలు, ప్రకృతి వైపరీత్యాలు కూడా పోలవరాన్ని దెబ్బతీశాయి. గతంలో వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్ట్ పునాది లాంటి డయాఫ్రమ్ వాల్ (Diaphragm Wall) తీవ్రంగా దెబ్బతిన్నది. ఇస్రో శాటిలైట్ చిత్రాలు, అంతర్జాతీయ నిపుణుల నివేదికల ప్రకారం.. పాత గోడ దెబ్బతినడం వల్ల దాని పక్కనే కొత్తగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రాజెక్ట్ పనులు కనీసం రెండేళ్లు వెనక్కి వెళ్లడమే కాకుండా, అదనంగా మరో రూ. 1,000 కోట్లకు పైగా భారం పడింది.
ఆర్ అండ్ ఆర్ చిక్కులు: పునరావాస ప్యాకేజీల వ్యయం మరో ₹15-18 వేల కోట్లు దాటేలా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.
కేంద్రం నుంచి వస్తున్నది ఎంత? రావాల్సింది ఎంత?
గత 11 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం ₹23,658 కోట్లు మాత్రమే. తొలి దశలోనే ఇంకా ₹6,645 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ కాకుండా 'అడ్వాన్స్' ఇస్తుండటం కొంత ఊరటనిచ్చే విషయమే అయినా, ఆ నిధులు ప్రాజెక్టు వేగాన్ని అందుకోవడానికి సరిపోవడం లేదు. పైగా ఈ నిధులు దారి మళ్లాయన్న విమర్శలు రానే వచ్చాయి.
పెంచిన కాలువల సామర్థ్యం (17,500 క్యూసెక్కులు) మేరకు నిధులు ఇవ్వడానికి కేంద్రం ఇంకా కొర్రీలు పెడుతూనే ఉంది.
రాష్ట్రాన్ని వెంటాడుతున్న నిధుల కొరత...
రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు లిక్విడిటీ (నగదు లభ్యత). రాష్ట్రం ఇప్పటికే జీతాలు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావాలి. ఇతర సంక్షేమ పథకాలకు మరో రూ.80 వేల కోట్లు కావాలి. ఒకవైపు ఉద్యోగుల జీతాలకే నిధుల కొరత ఉందని ప్రభుత్వం అంటున్న తరుణంలో, పోలవరం వంటి మెగా ప్రాజెక్టుకు రాష్ట్రం తన వంతు వాటా (ముఖ్యంగా R&R) ఎలా భరిస్తుందన్నది పెద్ద ప్రశ్న.

రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పునరావాసం అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టంగా చెబుతున్నారు. "నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడం సరికాదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాల్సిందే. ఆ నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే అది పేదల ఉసురు పోసుకోవడమే" అని హెచ్చరించారు. పోలవరం R&R ప్యాకేజీ – వాస్తవ స్థితి...
మొత్తం ఎంత కావాలి? (అంచనా)- రూ.18,000 కోట్లు నుంచి రూ.20,000 కోట్లు. ఇందులో భూమి కోల్పోయిన రైతులకు పరిహారం, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పునర్నిర్మాణం, కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు (రోడ్లు, నీరు, విద్యుత్, పాఠశాలలు), జీవనోపాధి పునరుద్ధరణ వంటివి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ వర్గాలు కనీసం రూ.15,000 కోట్లు అంటున్నా, ప్రస్తుత భూమి ధరలు, ఆలస్యాల దృష్ట్యా రూ.18–20 వేల కోట్లు అనేదే వాస్తవానికి దగ్గరగా భావిస్తున్నారు. ఇప్పటివరకు R&R కోసం ఖర్చైన మొత్తం సుమారు రూ.6,000 – రూ.6,500 కోట్లు.
పరిష్కారం ఎక్కడ ఉంది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రికి సమర్పించిన లేఖలో కొన్ని కీలక విన్నపాలు చేశారు. రెండో దశ నిధులపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉపయోగపడాలంటే రెండో దశ నిధులు అత్యవసరం. కాలువల తవ్వకంలో పెట్టిన 77-93% పరిమితిని తొలగించి, పూర్తి నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ శతాబ్దంలో పూర్తవుతుందా?
సాంకేతికంగా చూస్తే, కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున నిధుల ప్రవాహం ఆగదు. కానీ, రాజకీయ సంకల్పం, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల విడుదలలో సమన్వయం ఉంటే తప్ప ఈ 'శతాబ్దపు కల' త్వరగా సాకారం కాదు. ప్రస్తుతానికి తొలి దశ (+41.15 మీటర్లు) పూర్తి చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది పూర్తయితేనే కనీసం కొంత మేర నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది.
దీనిపై రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం ఇప్పుడు నిధుల వేటలో ఉంది. కేంద్రం నుంచి ₹32,000 కోట్ల రెండో దశ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తేనే, ప్రాజెక్టు పనుల్లో వేగం వస్తుంది అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యానికి, రాజకీయ సంకల్పానికి, కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు పరీక్షగా మారింది. తాజా అధికారిక అంచనాలు చూస్తే పోలవరం భవిష్యత్‌పై సందేహాలు సహజంగానే తలెత్తుతున్నాయని పి.జమలయ్య అభిప్రాయపడ్డారు.
2009 DPR ప్రకారం ఎడమ కాలువ – 8,123 క్యూసెక్కులు, కుడి కాలువ – 11,654 క్యూసెక్కులు. 2019 టెక్నికల్ కమిటీ సిఫార్సులతో రెండు కాలువలు 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సామర్థ్యం మేరకు ఖర్చయిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతోంది. అయితే కేంద్రం మాత్రం 2009 DPR ప్రకారమే నిధులు లెక్క కడుతోంది. దీనిలోనూ కుడి కాలువకు 93 శాతం, ఎడమ కాలువకు 77 శాతం మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని కోత పెట్టింది.
పోలవరం భవిష్యత్ ఏంటి?
ఈ గణాంకాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. పోలవరం ఇక ఇంజినీరింగ్ సమస్య మాత్రమే కాదు. అది ఆర్థిక సాధ్యత, కేంద్ర రాజకీయ సంకల్పం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అన్న మూడు అంశాల మీద ఆధారపడి ఉంది.

కేంద్రం రెండో దశకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తే తప్ప ప్రాజెక్టు వేగం పెరిగే అవకాశం లేదు. అదే సమయంలో రాష్ట్రం రాజధాని, సంక్షేమం, అభివృద్ధి అన్నింటినీ సమతుల్యం చేయాల్సిన గడ్డు పరిస్థితిలో ఉంది.
ఈ పరిస్థితుల్లో పోలవరం “ఈ శతాబ్దంలోనే పూర్తవుతుందా?” అన్న ప్రశ్న అతిశయోక్తి కాదు.
Tags:    

Similar News