చంద్రబాబు ‘ప్రజాగళం’ ప్రచారానికి ముహూర్తం ఫిక్స్
‘ప్రజాగళం’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి టీడీపీ సిద్ధమైంది. ఈ ప్రచారాన్ని ఈనెల 27 నుంచి ప్రారంభించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.
Update: 2024-03-24 10:24 GMT
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాగళం’ పేరిట ప్రచారం ప్రారంభించడానికి టీడీపీ సిద్ధమైంది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ‘ప్రజాగళం’ పేరిట అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే సభలు, రోడ్‌షోల్లో అందరూ పాల్గొని వాటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. ఈ ‘ప్రజాగళం’ ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రచారాన్ని ఈ నెల 27న ప్రారంభించాలని పార్టీ అధిష్టానం ముహూర్తం ఫిక్స్ చేసిందని వెల్లడించాయి. ఇప్పటికే ఈ ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపాయి. త్వరలోనే ఈ రోడ్ మ్యాప్‌ను చంద్రబాబు లేదా అచ్చెన్నాయుడు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.
‘ప్రజాగళం’ పేరిట ప్రచార సభలు, ర్యాలీలు 27 నుంచి 31 వరకు సాగుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనుంది టీడీపీ. వీటిలో 27న పలమనేరు, నెల్లూరు రూరల్, నగరి నియోజకవర్గాల్లో, 28న శింగనమల, రాప్తాడు, కదిరి, 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు, 30న ప్రొద్దుటూరు, సూళ్లూరు పేట, శ్రీకాళహస్తి, మైదుకూరు నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగనుందని, 31న మార్కాపురం, సంతనూతలపాడు, కావలి, ఒంగోలులో నిర్వహించే సభలు, రోడ్‌షోలతో ‘ప్రజాగళం’ ప్రచారాన్ని ముగించనున్నట్లు విశ్వనీయత వర్గాల నుంచి అందిన సమాచారం.
ప్రచారంలో మిత్ర పార్టీల నేతలు
ఈనెల 27న ప్రారంభమయ్యే ‘ప్రజాగళం’ ప్రచారంలో కూటమి సభ్య పార్టీలు జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారని, ప్రచారం జరిగే నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గంలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థి పాల్గొంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రచారంలో ఒకరోజు పవన్ కూడా పాల్గొనచ్చని, బీజేపీ నేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ ఈ ‘ప్రజాగళం’ ప్రచారంలో పాల్గొనడంపై జనసేన, బీజేపీ నేతలు ఇంకా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు.