‘విముక్తి కల్పించండి’.. చంద్రబాబు సర్కార్‌కు రమణ దీక్షితులు విన్నపం

గత ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

Update: 2024-07-15 07:45 GMT

‘గత ప్రభుత్వం నాపై పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి. ఐదేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరిగి అలసి పోయాను. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించడానికి సహాయం చేస్తే చాలా సంతోషం’’ అంటూ తిరుమల తిరుపతి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. తన పోస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేశారు. దీంతో ఇది ప్రస్తుతం హీట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుంచి బాధితులను రక్షిస్తామంటూ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించడంపై రమణ దీక్షితులు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ బాధితులందరికీ ఇది ఎంతో అద్భుతమైన వార్త అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ బాధితుల్లో తాను ఒకడినని, ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగుతూ చాలా ఇబ్బంది పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారాయన.

‘‘గత ప్రభుత్వ బాధితులంతా కూడా అక్రమ కేసుల నుంచి బయటపడం గొప్ప విషయం. టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న మేము అక్రమ కేసుల కారణంగా ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దయచేసి మమ్మల్ని మా కైంకిర్యాలను ప్రశాంతంగా చేసుకునేలా సహాయం చేయడంది. మీకు రుణపడి ఉంటాం’’ అంటూ రమణ దీక్షితులు పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే!

రమణ దీక్షితులు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో టీటీడీతో పాటు, మాజీ ఈఓ ధర్మారెడ్డి, తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై ఆ వీడియోలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సదరు వీడియోలో ఆయన ముఖ్యంగా ధర్మారెడ్డిని టార్గెట్ చేసినట్లు ఉంది. అది కాస్తా వైరల్ అయింది. దాంతో స్పందించిన ఆయన ఆ వీడియోకు తనకు ఎటువంటి సంబంధం లేదని, తనది అటువంటి స్వభావం కాదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే పరిణామాలు మారడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఆయనను ప్రధాన అర్చకుల పదవి నుంచి తప్పిస్తూ టీటీడీ పాలకమండలి కూడా తీర్మానించింది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది.

ఈ పరిణామాలలో భాగంగానే తిరుమలలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రమణదీక్షితులుపై కేసు నమోదైంది. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వ్యవహారంలో రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు రమణ దీక్షితులకు సీఆర్‌పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చి ఆయన వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది కోర్డు. ఆ తర్వాత కేసుకు సంబంధించి వాయిస్ నమూనా ఇవ్వాలని తిరుపతి కోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను రమణ దీక్షితులు.. ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో పలు వాయిదాలు వాదనలు జరిగాయి. ఇటీవల తిరుపతి కోర్టు ఆదేశాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు చేసింది. అంతేకాకుండా ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News