రామ్‌గోపాల్‌ వర్మను అరెస్టు నుంచి తప్పించలేం.. ఏపీ హైకోర్టు

సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రామ్‌గోపాల్‌ వర్మ అరెస్టు తప్పదనే టాక్‌ వినిపిస్తోంది.

Update: 2024-11-18 08:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళనలు ఉంటే బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను కించపరస్తూ సోషల్‌ మీడియాలో రామ్‌గోపాల్‌ వర్మ పోస్టులు పెట్టారు. వ్యూహం సినిమాలోను చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను కించపరి విధంగా సన్నివేశాలు ఉన్నాయనే అభ్యంతరాల మీద రామ్‌గోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పోలీసులే స్వయంగా హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్‌ వర్మ ఇంటికెళ్లి నోటీసులు అందించారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం మంగళవారం పోలీసు విచారణకు రామ్‌గోపాల్‌ వర్మ హాజరు కావలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రామ్‌గోపాల్‌ వర్మ పిటీషన్‌ను తోసిపుచ్చింది. అరెస్టు నుంచి రక్షించలేమని స్పష్టం చేసింది. ఆందోళనలు ఏమైనా ఉంటే బెయిల్‌ పిటీషన్‌ను దాఖలు చేసుకోవాలని, రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని రామ్‌గోపాల్‌ వర్మను ఆదేశించింది.

Tags:    

Similar News