రాయలసీమ ప్రజా ప్రతినిధులారా, సాగునీటి అభివృద్ధి పై మీ వైఖరి ఏమిటి?
‘గోదావరి-బనకచర్ల ద్వారా మాత్రమే రాయలసీమ సస్యశ్యామలం’ అనడం రాయలసీమ సమాజాన్ని కేవలం ఊరించడమే. మీరే మంటారు?;
బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమ లోని అనేక ప్రాజెక్టులకు (కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ - HLC, తుంగభద్ర దిగువ కాలువ - LLC, ఎస్ ఆర్ బి సి - SRBC, భైరవానితిప్ప, గాజుదిన్నె ప్రాజెక్టు, తదితర) సాగునీటి హక్కులను కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమలో నిర్మాణంలో ఉన్న నాలుగు ప్రాజెక్టులకు (తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ) హక్కులు కల్పించింది.
ఈ ప్రాజెక్టులు అన్నింటికీ కృష్ణా జలాలే ఆధారం. కృష్ణా జలాలు లభిస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడము లేక నిర్వహణ సరిగా లేకపోవడం వలన కృష్ణా జలాలను వినియోగించుకోలేకపోతున్నాం. ఈ విధంగా రాయలసీమ వినియోగించుకోలేని నీళ్లు ఒకవైపు శ్రీశైలం గేట్లు ఎత్తడం వల్ల కృష్ణా జిల్లా దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి,
మరొకవైపు రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం వల్ల రాయలసీమ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుండి ప్రధాన మరియు ఉప కాలువల నుండి కుందు, పెన్నా నదుల ద్వారా నెల్లూరు వైపు ప్రయాణించి సముద్రాన్ని చేరుతున్నాయి.
కృష్ణా జలాలు సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి, కానీ ఈ కృష్ణా జలాలను రాయలసీమ పంట పొలాల వైపు మళ్ళించడానికి నిర్మాణాలు పూర్తి చేయడం, అవసరమైన రిజర్వాయర్లను ప్రధాన కాలువలను నిర్మించడం, నిర్వహణను సక్రమంగా చేయడానికి ఎందుకో రాయలసీమ ముఖ్యమంత్రులకు మనసొప్పడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు…
ఇప్పుడూ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. కానీ రాయలసీమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకో నిధులు కేటాయించి పనులు పూర్తిచేసే కార్యాచరణ చేపట్టడం లేదు. ఉన్న కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవడానికి చేపట్టాల్సిన నిర్మాణాలను విస్మరించి పోలవరం, పట్టిసీమల ద్వారా రాయలసీమ సస్యశ్యామలమని గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన 11వ సంవత్సరంలో ఆ విషయాలు మరిచిపోయి “గోదావరి బనకచర్ల ద్వారా మాత్రమే రాయలసీమ సస్యశ్యామలం” అంటూ రాయలసీమ సమాజాన్ని ఊరిస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి, కృష్ణా జలాలను సముద్రం వైపు మళ్లించడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం కావాల్సిన నిర్మాణాలను పూర్తి చేయలేదు.. కానీ శ్రీశైలం గేట్లు ఎత్తి కృష్ణా జలాలను సముద్రం వైపు మళ్లించడానికి ముఖ్యమంత్రి గారు నేడు శ్రీశైలం వస్తున్నారు. వారు కృష్ణా జలాలను సముద్రం వైపు మళ్ళిస్తూనే, "గోదావరి బనకచర్లతోనే రాయలసీమ సస్యశ్యామలం" అనే విధానాన్ని మరీ మరీ ప్రకటించడం కాస్త విడ్డూరంగా ఉంది.
ఈ నేపథ్యంలో "గోదావరి బనకచర్లతోనే రాయలసీమ సస్యశ్యామలం" అనే విధానంపై రాయలసీమ ప్రజాప్రతినిధులు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని రాయలసీమ సమాజం కోరుకుంటుంది. ఇదే సందర్భంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు క్రింది అంశాలపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాయలసీమ సమాజం కోరుకుంటున్నది.
- కృష్ణా జలాలపై ఆధారపడిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, అవసరమైన రిజర్వాయర్లు ప్రధాన కాలువల నిర్మాణం చేపట్టకపోవడం, నిర్వహణ లోపంతోనో మీ నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీరు, పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. ఆ విధంగా వినియోగించుకొనలేని నీరంతా సముద్రం వైపు పరుగులు తీస్తున్నది.
- రాయలసీమ ప్రజా ప్రతినిధులు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైనా, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల కాలేదు. ప్రతిపాదనలు పంపాం నిధులు విడుదల కాగానే పనులు మొదలు పెడతాం అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
- అందరూ రాయలసీమ ముఖ్యమంత్రులే అయినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాయలసీమ ఎడారిగా మారుతున్నది. కృష్ణా జలాలు మాత్రం సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో మరియు వ్యవసాయ యోగ్యమైన భూమిలో రాయలసీమ 42 శాతం భూభాగం కలిగి ఉంది. కానీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కేవలం 8 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమికే నీరు లభిస్తున్నది. సాగునీటి హక్కులను రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిగా వినియోగించుకుంటే రాయలసీమలో 21 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమికి సాగునీరు అందించవచ్చు. కానీ అరకొర నిధులు కేటాయించడం వలన రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులను గాడిలో పెట్టడానికి రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతానికి పైన నిధులను తప్పకుండా కేటాయించాల్సి ఉంది. ఈ అంశంపై రాయలసీమ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
- రాష్ట్ర విభజన చట్టం వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో గత 11 సంవత్సరాలుగా ముఖ్యమంత్రులందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నిధులు సుమారు 30 వేల కోట్ల రూపాయలు సాధిస్తే, మీ నియోజకవర్గాలలో చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, సామాజిక అడవుల అభివృద్ధితో పెన్నా దాని ఉపనదుల పునరుజ్జీవనం, చెరువులను వాగులు, వంకలు నదులు, కాలువలతో అనుసంధానం చేసుకనే అవకాశం ఉంటుంది. రాయలసీమను సస్యశ్యామలం చేసుకోవడంలో ఈ ప్రత్యేక ప్యాకేజీ సాధించడం కూడా కీలకమే. ఈ అంశంపై దృష్టి నిలుపుతారా ? లేదా ఈ నిధులను “గోదావరి బనకచర్ల” కు మళ్లించుకోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలను సమర్థిస్తారా ?
- కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా, "గోదావరి బనకచర్ల తోనే రాయలసీమ సస్యశ్యామలం" అనే మభ్యపరిచే మాటలతోనే కాలం వెళ్లబుచ్చుతారా ? రాయలసీమ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పనిచేస్తారా ?
వివక్షతో కూడిన విధాన వలన రాయలసీమ ఉపయోగించుకొనలేని కృష్ణా జలాలను మన రాయలసీమ భూభాగం నుండి దిగువకు మళ్ళించి సముద్రం పాలు చెయ్యడం, దీనికి బదులుగా గోదావరి నదీ జలాలను దిగువ నుంచి ఎగువన ఉన్న రాయలసీమకు ఎత్తిపోసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం అంటున్న పాలకుల మాటలు "ఉలగ పోసుకుని ఎత్తుకోవడం లాగా" వుందని ఇక్కడి సమాజం వింతగా, విడ్డూరంగా చూస్తోంది.
అప్పుడు "పట్టిసీమ ద్వారా రాయలసీమ సస్యశ్యామలం" అన్నారు.. ఇప్పుడు "గోదావరి - బనకచర్ల తో రాయలసీమకు గేమ్ ఛేంజర్ అంటున్న పాలకుల చర్యలను రాయలసీమ సమాజం విశ్వసించడం లేదు.
పై విషయాలపై రాయలసీమ ప్రజాప్రతినిధులు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి తమ స్పష్టమైన వైఖరి ప్రకటించి అందుకు తగ్గట్లుగా కార్యాచరణ చేపట్టి రాయలసీమ సమాజానికి అండగా నిలబడటానికి కృషి చేయాలి.