PROPERTY ROW | అన్నా, తముణ్ణి సినీపక్కిలో చంపేసిన 'సిస్టర్'

కేవలం 35 లక్షల రూపాయల నగదు కోసం ఒకే తల్లికడుపున పుట్టిన బిడ్డలు కొట్లాడుకుని, కత్తులు నూరుకుని కడకు ప్రాణాలు తీసిన వైనం ఇది.

Update: 2024-12-18 06:13 GMT
అన్న.. చెల్లిని చంపాలనుకున్నాడు.. తమ్ముడు చెల్లికి ఆ విషయాన్ని చెప్పాడు.. మనిద్దరం కలిసి అన్నను చంపుదామా? అని చెల్లెలు తమ్ముడితో బేరం పెట్టింది. తమ్ముడు ససేమిరా అన్నాడు, చెల్లి ప్రియుడు రంగంలోకి దిగాడు. తమ చేతికి మట్టి అంటకుండా ఓ నలుగురు మైనర్లను రంగంలోకి దించారు. అటు అన్ననీ, ఇటు తమ్ముణ్ణీ మట్టుబెట్టారు. ఇప్పుడిద్దరూ కటకటాలు లెక్కపెడుతున్నారు. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నారేమో.. అదేమీ కాదు. కేవలం 35 లక్షల రూపాయల నగదు కోసం ఒకే తల్లికడుపున పుట్టిన బిడ్డలు కొట్లాడుకుని, కత్తులు నూరుకుని కడకు ప్రాణాలు తీసిన వైనం ఇది. ఆస్తుల ముందు ఆప్యాయతలు, అనుబంధాలు ఉత్త భూటకమని ఎవరో సినిమా కవి అంటే ఇదేం విడ్డూరమన్న వాళ్లూ.. ఔరా, ఇదే కదా లోకం తీరు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
హత్యలు ఎలా జరిగాయంటే...
పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని నకరికల్లు యానాదుల కాలనీలో తలపాల పోలరాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండేవారు. అనారోగ్యంతో 2024 జనవరి 4న చనిపోయారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు గోపీకృష్ణ, పోలీసు కానిస్టేబులు. రెండో వాడు దుర్గా రామకృష్ణ. కుమార్తె కృష్ణవేణి. పోలరాజు చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆయన కుటుంబానికి సుమారు రూ.70 లక్షల నగదు వివిధ రూపాలలో రానుంది. ఈ డబ్బును ఎలా పంచుకోవాలనే విషయంలో వీళ్లు గొడవలు పడడం మొదలుపెట్టారు. పెద్దలు పంచాయితీ చేసినా వివాదాలు సద్దుమణగలేదు.
సరిగ్గా ఈ దశలో ఓ రోజు తమ్ముడు దుర్గా రామకృష్ణ కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. ‘అన్న గోపీకృష్ణ నిన్ను చంపేసి, ఆస్తి మొత్తం పంచేసుకుందామని చెప్పాడని’ ఆమెతో అన్నాడు. ‘మా డబ్బు కోసం నువ్వు అడ్డొస్తున్నావు.. నిన్ను చంపాలని అన్న పథకం పన్నాడు. నీ అడ్డు తొలగించుకుని చెరో రూ.35 లక్షలు పంచుకుంటాం’ అని సోదరితో తమ్ముడు మద్యం మత్తులో అన్నాడు. ఈ మాటకు ఖంగుతిన్న కృష్ణవేణి 'అట్లయితే అన్నను మనిద్దరం కలిసి చంపేద్దాం, నువ్వు కలుస్తావా' అని అడిగింది. దీనికి తమ్ముడు బెదిరిపోయాడు. ఇక లాభం లేదనుకున్న కృష్ణవేణి తన మనసులో ప్లాన్ చేసుకున్న పక్కా ప్రణాళిక అమలుకు నడుంకట్టింది. 'అసలు వీళ్లిద్దరీ చంపేస్తే మొత్తం తనకే దక్కుతుంది కదా' అని ప్లాన్ చేసింది.
అనుకున్నదే తడవుగా నకరికల్లుకు చెందిన తన ప్రియుడు మల్లాల దానయ్యను పిలిపించింది. విషయం చెప్పింది. అయితే అతను 'నేరుగా తాను హత్యల్లో పాల్గొనలేనన్నాడు. కావాలంటే డబ్బుతోపాటు మృతదేహాలను తరలించేందుకు వాహనం సమకూరుస్తానని హామీ ఇచ్చాడు'. దీంతో కృష్ణవేణి- నలుగురు మైనర్లను ఎంపిక చేసుకుంది. తాను చెప్పినట్లు చేస్తే ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పింది. అయినా వాళ్లు దారికి రాకపోవడంతో 'శారీరక సుఖంతో పాటు డబ్బులు ఇస్తానని' ఆశ చూపింది. వీటికి లొంగని పురుషపుంగవుడు ఎవరుంటాడు..ప్లాన్ సిద్ధమైంది.
పథకం ప్రకారం నవంబర్ 26న తమ్ముడు దుర్గా రామకృష్ణను ఇంటికి పిలిపించింది. బాగా మద్యం తాపించింది. ఇద్దరు మైనర్లతో కలిసి గొంతు నులిమి చంపింది. అనంతరం ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకెళ్లి చల్లగుండ్ల వద్ద గోరంట్ల మేజర్‌లో పడేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఆ తర్వాత అన్న గోపీకృష్ణ హత్యకు పథకం రచించింది. మరో ఇద్దరు మైనర్లతో ఒప్పందం చేసుకుంది. డిసెంబర్ 10న గోపీకృష్ణ సోదరికి ఫోన్‌ చేసి, మద్యం తాగేందుకు రూ.500 డబ్బులు కావాలని అడిగాడు. ఇదే అదునుగా భావించి ఇంట్లో మద్యం సీసా ఉందంటూ పిలిపించింది. మద్యంలో మత్తు మాత్రలు కలిపి, అన్నతో తాగించింది. మత్తులోకి జారుకున్న అతడి మెడకి తాడు బిగించి హత్య చేసింది. మైనర్లతో కలిసి మృతదేహాన్ని మూటగట్టుకుని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి గుంటూరు బ్రాంచి కాలువలో పడేశారు.
గోపీకృష్ణ పోలీసు కానిస్టేబుల్ కావడంతో పల్నాడు జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. కాలువలో దొరికిన శవాన్ని గుర్తుపట్టి దర్యాప్తునకు ఉపక్రమిస్తే అసలు గుట్టు రట్టయింది.
సత్తెనపల్లి గ్రామీణ సీఐ సుబ్బారావు, నకరికల్లు ఎస్సై సురేష్‌ కేసును సీరియస్ గా తీసుకున్నారు. వారం రోజులు ఊరూరా తిరిగి విషయాన్ని రాబట్టి ప్రధాన నిందితురాలు కృష్ణవేణి, ఆమె ప్రియుడు దానయ్య, మరో నలుగురు మైనర్లను అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లులో జరిగిన వరుస హత్యల కేసు వివరాలను సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు డిసెంబర్ 17న మీడియాకి వివరిస్తూ.. ఇదంతా క్రైమ్ సినిమాను తలపిస్తోందని, మనుషుల మధ్య అనుబంధాలు ఏమయి పోతున్నాయోనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News