YOUTUBE THEFT | యూ ట్యూబ్ వెతికి మేనత్త ఇంటికి కన్నమేసిన అల్లుడు!
పోలీసులకు దొరక్కుండా రాత్రుళ్లు యూట్యూబ్ అంతా వెతికి ప్లాన్ వేసినా కటకటాలు లెక్కించాల్సిన వచ్చింది ఈ కుర్రోడికి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో జరిగింది.;
By : The Federal
Update: 2024-12-13 04:13 GMT
తాడి ఎక్కేవాడుంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడని ఈ నిందితుడు మరచినట్టున్నాడు. మేనత్త, మామపై కసితో మేనత్త ఇంటికి కన్నం వేసి పోలీసులకు దొరికిపోయాడో ప్రబుద్ధుడు. పోలీసులకు దొరక్కుండా రాత్రుళ్లు యూట్యూబ్ అంతా వెతికి ప్లాన్ వేసినా కటకటాలు లెక్కించాల్సిన వచ్చింది ఈ కుర్రోడికి. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో జరిగిన ఈ సంఘటన వివరాలు..
నంగనూరుపల్లెకు చెందిన మునెయ్య, గంగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. బెంగళూరులో స్థిరపడ్డారు. మునెయ్య ఆర్టీసీలో ఏఎస్‌ఐ. గంగమ్మ గృహిణి. గంగమ్మ సొంతూరు వేముల మండలం రాచకుంటపల్లె. ఆమెకు ఓ అన్న ఉన్నారు. ఆయన పేరు మనోహర్. ఈయనకు ఒక కుమారుడు వినోద్ ఉన్నాడు.
మనోహర్ ఇటీవలి కాలంలో అప్పులు చేసి తీర్చలేకపోయాడు. దీంతో పొలం అమ్మి బాకీలు తీర్చాలనుకున్నాడు. అందుకు చెల్లెలు గంగమ్మ అంగీకరించలేదు. రిజిస్ట్రేషన్ కాగితాలపై ఆమె సంతకాలు చేయనని భీష్మించింది. దీంతో అన్నాచెల్లెలి కుటుంబాల మధ్య మనస్పర్థలొచ్చాయి. అవి కక్షలు పెంచుకునే దాకా వెళ్లాయి. ఈ క్రమంలో అప్పుల బాధతో మనోహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తన తండ్రి చావుకి మేనత్త గంగమ్మే కారణమని మేనల్లుడు వినోద్ కక్ష పెంచుకున్నాడు. వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వారి ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ చేశాడు. పట్టుబడకుండా ఉండడానికి రాత్రుళ్ల తరబడి యూట్యూబ్ అంతా వెతికాడు. ఇల్లంతా కారంపొడి చల్లితే ఆనవాలు చిక్కవని తెలుసుకున్నాడు. కారంపొడి చల్లితే పోలీసు కుక్కలు కనుక్కోలేవని తెలుసుకుని పథకం సిద్ధం చేసుకున్నాడు.
ఇందులో భాగంగా ముందు మేనత్తతో మంచిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. కుటుంబ ముచ్చట్లు పెట్టాడు. మాటల సందర్భంలో గంగమ్మ తాము నవంబరు 9న బెంగళూరు వెళ్తున్నామని చెప్పిది. ఇదే అదనుగా భావించిన వినోద్ ఈ నెల 10న రూ.4.60 లక్షల విలువైన 15.5 తులాల బంగారు ఆభరణాలు, పాసుపుస్తకాలు దొంగలించాడు. ఆ తర్వాత ఇల్లంతా కారంపొడి చల్లి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత 12న తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న మునెయ్య కుటుంబం తమ ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వినోద్‌పై అనుమానం రావడంతో ప్రొద్దుటూరు-మైదుకూరు రోడ్డులో డిసెంబర్ 12న అరెస్టు చేశారు. యూట్యూబ్ చూసి తాను చోరీ చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీ చేసుకుని రిమాండుకు తరలించారు.
పొలం గొడవలతో మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడినట్టు ప్రొద్దుటూరు పోలీసులు భావిస్తున్నారు. మేనత్త కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఈ పని చేశాడని చెప్పారు.