రైళ్ల ట్రాక్ క్రాసింగ్‌కు అత్యాధునిక డబ్ల్యుసిఎంఎస్ (WCMS)
భారతీయ రైల్వేలో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా డబ్లు్యసిఎంఎస్ టెక్నాలజీని రైల్వే శాఖ విజయవంతంగా ఏర్పాటు చేసింది.
Byline : G.P Venkateswarlu
Update: 2024-05-30 02:44 GMT
దక్షిణ మధ్య రైల్వేలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే శాఖ ట్రాక్‌ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. రైళ్లు ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారే క్రాసింగ్ వద్ద ఉన్న టెక్నాలజీని రైల్వేశాఖ మారుస్తోంది. ఈ మార్పుల వల్ల రైళ్ల వేగం తగ్గకుండా సురక్షితంగా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న సాంప్రదాయ విధానాన్ని మారుస్తున్నారు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెం యార్డులో మొదటి సారిగా జరిగింది.
ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ఏమిటి?
రైలు ఒక లైను నుంచి మరో లైనుకు దాటే జంక్షన్‌ల వద్ద ఇప్పటి వరకు రెండు బ్లాక్ సెక్షన్‌ల మధ్య లాంగ్ వెల్డ్ రైల్స్ (RWR) ఉండేవి. రైల్ లైన్ మారే ముందు యార్డుల్లో టర్న్‌అవుట్స్ వెనుక ఫిష్‌ప్లేట్ జాయింట్‌లను వేరు చేస్తారు. దీని వల్ల రైలు వేగం బాగా తగ్గించుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ట్రాక్ మారే సమయంలో రైలు కుదుపుల వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యేవారు. ప్రయాణ సమయం ఎక్కువ తీసుకునేది. ఇకపై అటువంటి పరిస్థితులు ఉండవు.
అందుబాటులోకి వచ్చిన డబ్ల్యుసీఎంఎస్ (wcms) టెక్నాలజీ
దక్షిణమధ్య రైల్వేలో పెరుగుతున్న రైళ్ల వేగాన్ని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలు చర్యలు చేపట్టింది. ట్రాక్‌ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక టెక్నాలజీ అయిన వెల్డబుల్ కాస్ట్ మ్యాంగనీస్ స్టీల్ (wcms)ను ఉపయోగించారు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ–గూడూరు సెక్షన్ పరిధిలోని బాపట్ల జిల్లా వేటపాలెం డౌన్‌లైన్‌లో రైల్వే అధికారులు ఉపయోగించారు. ఈ పరిజ్ఞానాన్ని దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో మొదటి సారిగా ఉపయోగించటం విశేషం. భారతీయ రైల్వే పరిధిలో ఇది రెండోవది. రైలు సుమారు 130 కిలో మీటర్ల వేగంతో వెళ్లినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ టెక్నాలజీతో యార్డుల్లో టర్నవుట్స్ వెనుక ఫిష్‌ప్లేట్ జాయింట్స్‌తో వేరే చేయాల్సిన అవసరం పోయింది. హెవీ యాక్సిల్ లోడ్‌ను అధిగమించేందుకు డబ్లు్యసిఎంఎస్ క్రాసింగ్ ఎంతో ఉపయోగ పడుతుందని విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎ నరేంద్ర పాటిల్ తెలిపారు. విజయవాడ డివిజన్‌లో ఇది చారిత్రాత్మక మైలురాయిగా మిగులుతుందన్నారు.
క్రాసింగ్ వద్ద దేశంలో ఇప్పటివరకు పలు చోట్ల ఎక్కువ ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు ఇకపై చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.