చంద్రబాబుపైనా రాయి..

టీడీపీ అధినేత చంద్రబాబుపైనా రాయి దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబుకు ఏమీ కాలేదు. కాగా ఈ దాడుల అంతు తేలుస్తానని చంద్రబాబు అన్నారు.

Update: 2024-04-14 15:17 GMT
Source: Twitter

ఆంధ్రలో ప్రస్తుతం రాళ్ల రాజకీయం నడుస్తోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఒకరి తర్వాత ఒకరుగా రాళ్ల దాడులకు బాధితులు అవుతున్నారు. నిన్న సీఎం జగన్, ఈరోజు సాయంత్రం జనసేనాని పవన్ కల్యాణ్, మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన ప్రజాగళం సభలో జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది బాబును సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి రాయి విసిరారు. కానీ అది ఆయనకు కాస్త దూరంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపులు చేపట్టారు. అయితే కొద్ది సేపటికే తిరిగి ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ వరుస రాళ్ల దాడులపై స్పందించారు.

‘‘నిన్న కరెంటు పోయిన సమయంలో సీఎం జగన్‌పై రాయి విసిరారు. కానీ ఇప్పుడు నాపై కరెంటు ఉండగానే రాయి విసిరారు. ఈ పని చేస్తోంది గంజాయి, బ్లేడ్ బ్యాచే. తెనాలిలో పవన్‌పై కూడా రాయి వేశారు. నిన్న విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా. గత ఎన్నికలప్పుడు కూడా నాపై రాళ్లు వేశారు. క్లైమోర్ మైన్స్‌కే నేను భయపడలేదు. ఇలాంటి గులకరాళ్లకు భయపడతానా? సీఎం సభలో కరెంటు పోయినప్పుడు దాడి జరిగింది. ఆ సమయంలో కరెంట్ తీసిన వారిపై, రాయి విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలా దాడులు జరుగుతుంటే ప్రేక్షకపాత్ర వహించడానికి పోలీసులు ఉన్నారా? నిన్న జగన్‌పై జరిగిన దాని నా పనే అని పేటీఎం కుక్కలు ఇష్టం వచ్చినట్లు మొరిగాయి. మరి ఈ రోజు మాపై రాళ్లు ఎవరు వేయించారు’’అని ప్రశ్నించారు. చంద్రబాబు.

Tags:    

Similar News