నందిగం సురేష్‌కు బెయిల్‌ను నిరాకరించిన సుప్రీం కోర్టు
మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు గతంలో నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బ తగిలింది. ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్క ఎదురవగా, తాజాగా సుప్రీం కోర్టులోను ఎదురు దెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. మరియమ్మ అనే హత్య కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నందిగం సురేష్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రముఖ న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ సభ్యులు కపిల్ సి» ల్ నందిగం సురేష్ తరుపున వాదనలు వినిపించారు. ఈ కేసుపై విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు నందిగం సురేష్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కపిల్ సిబల్ సుప్రీం కోర్టును కోరారు. అయితే కపిల్ సిబల్ అభ్యర్థిత్వాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఈ కేసులో ఇంకా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. నిందితుడుగా ఉన్న నందిగం సురేష్ అరెస్టు అయి 90 రోజులు పూర్తి కాలేదని, దీంతో మధ్యంతర బెయిల్‌కు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది.
దీంతో పాటుగా ఈ కేసు గతాన్ని కూడా ప్రస్తావించింది. నందిగం సురేష్‌పై గతంలో నమోదైన కేసు వివరాలను బెయిల్ పిటీషన్‌లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ కేసు 2020లో నమోదైతే అప్పటి ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదని, విచారణ జరిపి ఉంటే నందిగం సురేష్ నిర్దోషిత్వం బయటపడేది కాదా అని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై చార్జిషీటు ఫైలైన తర్వాత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. జనవరి 7న ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం తీర్పును వెలువరిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిని సుప్రీం కోర్టులో నందిగం సురేష్ సవాల్ చేశారు.