ఒంగోలు కార్పొరేషన్‌లో ఎగిరిన టీడీపీ జెండా

ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ చేతుల్లో ఉన్న కార్పొరేషన్‌ టీడీపీ వశమైంది.

Update: 2024-08-15 04:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ పిరాయించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఈ విషయాన్ని నెల రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌ ఫెడరల్‌ చెప్పింది. వైఎస్సార్‌సీపీ ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఖాళీ అవుతోందని చెప్పినప్పుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండిస్తూ మునిసిపాలిటీ నుంచి కార్పొరేటర్లు ఎవ్వరూ వెళ్లరని సెలవిచ్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఏమిటో అర్థం కాకుండా ఉంది.

ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్‌లు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా 43 మంది వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచారు. ఆరుగ్గురు టీడీపీ నుంచి, ఒకరు జనసేన నుంచి గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ నుంచి గంగాడ సుజాతను కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ గెలిపించింది. సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో టచ్‌లోకి వెళ్లారు. గంగాడ సుజాతను కాకుండా వేరే వారిని చైర్‌పర్సన్‌గా ఉంచాలని భావించిన దామచర్ల జనార్థన్‌ ఆమె పార్టీలో చేరుతానని చెప్పినా పెద్దగా స్పందించలేదు. కార్పొరేటర్లను చేర్చుకుని తనకు అనుకూలురైన వారి నుంచి ఒకరిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బుధవారం చైర్‌పర్సన్‌ గంగాడ సుజాతతో పాటు మరో 16 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ సమక్షంలో నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద వీరంతా టీyీ పీ కండువాలు కప్పుకున్నారు.
ప్రస్తుతం ఒంగోలు మునిసిపాలిటీలో టీడీపీ బలం 28కి పెరిగినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి ఒంగోలు మునిసిపాలిటీ పోవడంతో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
తామంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని, ఈ విషయం వాసన్నకు చెప్పాలని కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గంగాడ సుజాత బాలినేని సన్నిహితుడైన ఓ వ్యక్తికి చెప్పారు. ఆ వ్యక్తి ద్వారా సుజాతతో మాట్లాడించి ఆపే ప్రయత్నం చేశారు. అయితే తాము ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉన్నామని, అందువల్ల వెళుతున్నామని చెప్పి టీడీపీలో చేరారు. ఒంగోలు మునిసిపాలిటీలో మొదటి నుంచీ కాంగ్రెస్‌కు పట్టు ఉంది. ఆ తరువాత వైఎస్సార్‌సీపీకి పట్టు పెరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అంతా నడిచారు.
ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ వారు మాగుంటకు సీటు ఇవ్వకపోవడం, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలు పూర్తిగా వైఎస్‌ జగన్‌ తిరస్కరించడంతో బాలినేని కూడా తెలుగుదేశంలో చేరేందుకు ఒక దశలో సిద్ధమయ్యారు. అయితే టీడీపీ వారే ఆలోచించి అడుగు వెనక్కి వేశారని సమాచారం. ఏమైనా బాలినేని కూడా వైఎస్సార్‌సీపీపై అసంతృప్తితోనే ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కూడా త్వరలో వైఎస్సార్‌సీపీని వీడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక వేళ బాలినేని వైఎస్సార్‌సీపీని వీడితే జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన నాయకులతో ఆయన టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇదే బాటలో జిల్లా పరిషత్‌ కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ జడ్‌పీటీసీలు వైఎస్సార్‌సీపీ వారే ఉన్నారు. అయితే వీరంతా ప్లాన్‌ ప్రకారం టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరందరికీ భారీ స్థాయిలో నజరానాలు చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం.


Tags:    

Similar News