కూటమి సర్కార్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది

కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదులు చేశారు.;

Update: 2025-03-13 13:27 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, అది సాగిస్తున్న పాలనా తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేసింది. సీనియర్‌ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌తో పాటు పలువురు ‡ నేతలు గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, టీడీపీ వారికే పని చేయండి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి ఎట్టిపరిస్థితుల్లో పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఇది చాలా అభ్యంతరకరమని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీను చూడకూడదని, లబ్ధిదారుల ఎంపికలో పార్టీలు, వర్గాలు ఉండవన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయో.. వాటికి అనుగుణంగా లబ్ధిదారులకు మేలు చేయాలి. అది రాజ్యాంగం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చిన హక్కు. కానీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘనలకు చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడే కాదు, కేబినెట్‌ మొత్తం ఇలానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగించాలన్నారు. సామాన్యులకు రాజకీయాలను పులమడం సరైంది కాదన్నారు. వివక్షకు తావులేకుండా ప్రజలకు మేలు చేయాలన్నారు. కానీ కూటమి సర్కార్‌ చూపిస్తోన్న వివక్ష మంచిది కాదన్నారు. రాను రాను ఇది మరింతగా మితిమీరి పోతోందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును, రాజ్యాంగ ఉల్లంఘల మీద జోక్యం చేసుకొని, చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
Tags:    

Similar News