ఉత్తర కోస్తాలో మొదలైన ‘మొంథా’ ప్రతాపం!

మొంథా తుఫాన్‌ ప్రభావం ఉత్తర కోస్తాంధ్రలో మొదలైంది. సోమవారం వేకువజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది.

Update: 2025-10-27 12:38 GMT
తుపాను ప్రభావంతో కంచరపాలెంలో కురుస్తున్న వాన

నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకుని కొనసాగుతున్న మొంథా తుఫాన్‌ ఉత్తర కోస్తాపై పంజా విసరడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందస్తు సంకేతాలిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే మొంథా ఉనికిని చాటుకుంటోంది. గంటకు 50–60 కి.మీల వేగంతో హోరెత్తుతూ ఈదురు గాలులు వీస్తున్నాయి. కాసేపు భారీ, మరికాసేపు తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉత్తర కోస్తాంధ్రతో పాటు విశాఖ నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. మొంథా తుఫాన్‌ మంగళవారం రాత్రికి కాకినాడకు సమీపంలో తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. జనం బీచ్‌లు, నదీ తీరాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

విశాఖ అక్కయ్యపాలెంలో సోమవారం మధ్యాహ్నం కురుస్తున్న వర్షం

 

కుంభవృష్టికి ఆస్కారం..

ఆదివారం ఆర్థరాత్రి సమయానికే బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. అది ప్రస్తుతం గంటకు 18 కి.మీల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి మొంథా తుఫాన్‌ కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీలు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 600 కి.మీల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి మొంథా తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారనుంది. తీవ్ర తుఫాన్‌గా మారాక భారీ వర్షాలతో పాటు పెనుగాలులు మరింత తీవ్రంగా వీస్తాయి. దక్షిణ , ఉత్తర కోస్తాంధ్రల్లో గరిష్టంగా 10–15 సెం.మీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విశాఖ జిల్లా గాజువాకలో అత్యధికంగా 5.2, విశాఖలో 4.5, అనకాపల్లి జిల్లా పరవాడలో 4.1, శ్రీకాకుళం జిల్లా పోలాకిలో 3.7, కోనసీమ జిల్లా మల్కిపురంలో 2.4, కాకినాడలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.

తుఫాన్‌ ముందర ప్రశాంతత..

సాధారణంగా తుపాను ముందర ప్రశాంతతగా చెబుతుంటారు. ఇప్పుడు విశాఖ సహా ఉత్తర కోస్తాంధ్రలో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షంతో పాటు గాలుల ఉధృతి కూడా తగ్గింది. సోమవారం రాత్రి నుంచి మళ్లీ గాలులు, వర్షం విజృంభించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి తుఫాను తీరం దాటే వరకు పెనుగాలులు, కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News