ఆ ముగ్గురి పీఎస్‌ల సస్పెన్షన్ లను పొడిగించారు
ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వాని వేధింపుల కేసులో ఇప్పటికే వీరు సస్పెన్షన్‌లో ఉన్నారు.;
కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కొంత మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని వారి మీద చర్యలకు ఉపక్రమించింది. దీని కోసం ముంబాయి సినీ నటి కేసును తెరపైకి తెచ్చింది. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానిని వేధింపులకు గురి చేశారని కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అందులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన కాంతి రాణా టాటాతో డీసీపీగా పని చేసిన విశాల్ గున్నీలు ఉన్నారు. వీరితో పాటుగా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి, నాడు నిఘా విభాగం అధిపతిగా పని చేసిన అదనపు డీజీ ర్యాంకులో ఉన్న పీ సీతారామాంజనేయులు కూడా సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల జాబితాలో ఉన్నారు.
మరో సారి వీరి సస్పెన్షన్ తాజాగా తెరపైకి వచ్చింది. వీరి సస్పెన్షన్ పొగించాలని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పాటు పొడిగించారు. గతంలో సస్పెండ్ చేసిన గడువు ముగియడంతో వీరి సస్పెన్షన్ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 25 వరకు వీరి సస్పెన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తప్పుడు కేసులో ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానిని అరెస్టు చేసి, వేధింపులకు గురి చేశారనే అభియోగాలతో పాటు అఖిల భారత సీర్వసు నిబంధనలను ఈ ముగ్గురు అధికారులు ఉల్లంఘించారనే అభియోగాల మీద ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌లను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.