అసెంబ్లీలో నేడు వాడీ వేడీ చర్చలు

గురువారం అటు శాసన సభలోను, ఇటు శాసన మండలిలోను కీలకమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి.;

Update: 2025-03-13 05:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. పదకొండో రోజు ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గురువారం ముఖ్యమైన బిల్లును కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2024 ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభల్లో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల మీద చర్చలు కొనసాగుతున్నాయి. శాసన సభ ఉదయం 9 గంటలకే ప్రారంభం కాగా, శాసన మండలిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ కేటాయింపులపైన ఉభయ సభల్లోను చర్చ జరగనుంది. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నాయి. శాసన సభలో హౌసింగ్‌ మీద చర్చలు జరగనున్నాయి. డిట్కో ఇళ్లు, లబ్ధిదారుల ఎంపిక, లబ్దిదారుల మార్పులు, నిర్మాణాలు వంటి అంశాల మీద చర్చించనున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల మీద జరిగిన పనులు, తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు మీద కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వలసల మీద కూడా చర్చించనున్నారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలసలను ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంత మేరకు వలసలు వెళ్లారు, ప్రస్తుతం కూటమి హయాంలో వలసల పరిస్థితి ఎలా ఉందనే దానిపైనా కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా బిల్లుల చెల్లింపుల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన చర్చించనున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న అక్రమాలు, వాటికి కారకులు ఎవరు, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయనే అంశాలను కూడా చర్చించనున్నారు.
దీంతో పాటుగా విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు మీద కూడా సభ్యులు చర్చలు జరపనున్నారు. ఇంధన రంగం మీద, 2019–204 మధ్య కాలంలో జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల మీద చర్చలు జరగనున్నాయి. సామాజిక భద్రత ఫించన్ల మీద కూడా మండలిలో చర్చించనున్నారు. వీటితో పాటుగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, పర్మిట్‌ రూములకు అనుమతుల వంటి అంశాల మీద కూడా చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మీద చర్చలు జరగనున్నాయి. గత ప్రభుత్వంలో తెరపైకొచ్చిన జగనన్న కాలనీలు, వాటిల్లో చోటు చేసుకున్న అక్రమాల మీద చర్చించనున్నారు. వీటితో పాటుగా నూతన పర్యాటక విధానం మీద కూడా చర్చలు జరగనున్నాయి.
అయితే శాసన సభకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు డుమ్మా కొట్టారు. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం చేసిన నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిరసనలు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత సభ నుంచి వెళ్లి పోయారు. నాటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. దీంతో అధికార పక్షం మాత్రమే సభలో మిగిలింది. దీంతో ఆత్మ స్తుతి, పరనిందలా శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి.
అయితే మండలిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో వాడీ వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షాన్ని అడ్డుకునేందుకు సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి కూడా మండలిపైనే పెట్టింది. మంత్రి నారా లోకేష్‌ తన సమయాన్ని మండలిలోనే వెచ్చిస్తూ.. ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టేందుకు అధికార పక్షం కొత్త వ్యూహానికి తెర తీసింది. అందులో భాగంగా గురువారం జగన్‌ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య కాలంలో జరిగిన కుంభకోణాలపై మండలిలో లఘు చర్చ పెట్టాలని నిర్ణయించారు.
Tags:    

Similar News