రీటైనింగ్ వాల్ చరిత్ర ఇదే..
రీటైనింగ్ వాల్ నిర్మించినా ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు చెబుతున్నారు. తామే కట్టామని టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు గొడవలు పడుతున్నాయి. అసలు దీని ప్రస్థావన ఎప్పుడు ప్రారంభమైందంటే..
Byline : Vijaykumar Garika
Update: 2024-09-06 14:04 GMT
విజయవాడ వరదలు వచ్చినప్పుడల్లా మొదటిగా ప్రతి ఒక్కొరికి గుర్తొచ్చేది కృష్ణా నది పక్కన నిర్మించిన రీటైనింగ్ వాల్ నిర్మాణం. ప్రస్తుత కృష్ణా నది వరదల నేపథ్యంలో ఇది తాజాగా తెరపైకి వచ్చింది. మేము కట్టామంటే మేము కట్టామని తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాదులాడుకుంటున్నాయి. రంద్రాల ద్వారా పెద్ద ఎత్తున్న వరద నీరొచ్చి ఇళ్లను ముంచెత్తుతుంటే, దానిని పక్కన పెట్టి వాల్ క్రెడిట్‌ను తమ ఖాతాల్లో వేసుకునేందుకు సిగ్గు లేకుండా ఆరాటపడుతున్నాయి. రీటైనింగ్ వాల్ పొడవునా పేద ప్రజలు ముంపునకు గురై.. కూలీ నాలీ చేసుకుని సంపాదించుకున్న వస్తువులన్నీ పోగొట్టుకొని కన్నీటి పర్యంతం అవుతుంటే వారిని ఓదార్చి భరోసా కల్పించాల్సిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు వాదులాడుకోవడం సిగ్గు చేటు.
రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించినా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని పూర్తి చేసినా, అసలు రీటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ, అనుమతులు మంజూరైంది కానీ నాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే.
అంతకు ముందు వామ పక్ష పార్టీలు రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పోరాటాలు చేపట్టాయి. కృష్ణా నదికి వరదలు వస్తే కృష్ణా నది తీరం వెంబడి కరకట్టపైన గుడెసెలు వేసుకొని బతుకీడుస్తున్న కాలనీలన్నీ ముంపునకు గురవుతాయని, వీరితో పాటు సమీపంలో ఉన్న కాలనీలన్నీ ప్రమాదానికి లోనవుతాయని, వారికి రక్షణ కల్పించాలంటే ఒక రక్షణ గోడను నిర్మించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి.
2009 అక్టోబర్‌లో ఒక్క సారిగా కృష్ణా నది పొంగడం, విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు సంభవించడం, కృష్ణా నది తీరం వెంబడి ఉన్న వేలాది కుటుంబాలు ముంపునకు గురికావడం, భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం, లక్షలాది మంది నిరాశ్రయులు కావడం ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్‌ను ఓ కుదుపు కుదిపింది. దీంతో మరో సారి రీటైనింగ్ వాల్ నిర్మాణం అంశం మరో సారి తెరపైకి వచ్చింది. రీటైనింగ్ వాల్ నిర్మాణం ప్రాముఖ్యతను ప్రపంచానికి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా విజయవాడలో భారీగానే ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో రీటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నాటి విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న యలమంచిలి రవి అసెంబ్లీలో పట్టుబట్టారు. నాటి ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు మంజూరు చేయాలని గట్టిగానే ఫైట్ చేశారు. దీంతో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రీటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కే రోశయ్య ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టుకు డీపీఆర్‌లు సిద్ధం చేసే దిశగా అడుగులు వేశారు. అయితే ఈ లోగా నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ప్రేయారిటీలు మారిపోయాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో రీటైనింగ్ వాల్ నిర్మాణం మరుగున పడింది.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం దీని ప్రాధాన్యతను గుర్తించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు డీపీఆర్‌లు కూడా సిద్ధం చేశారు. మూడు దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఒక దశను మాత్రమే నాటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయగలిగారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన రెండు దశలను పూర్తి చేసింది. అయితే తొలి దశలో నిర్మించిన గోడకు, తర్వాత కట్టిన వాల్‌కు ఉన్న రంద్రాలను మాత్రం అలాగే వదిలేశారని, అవి లేకుండా చేయడంలో ప్రభుత్వాలు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. వాటి ఫలితమే నేడు తాము ముంపునకు గురి కావలసి వస్తోందని, గోడ కట్టినా ఉపయోగం లేకుండా పోయిందని ముంపునకు గురైన స్థానికులు చెబుతున్నారు.