సీమ రక్తాక్షరిని చెరిపిన సంస్కరణలు..!

రాయలసీమలో జరిగిన మూడు ఘటనలు దేశం దృష్టిని ఆకర్షించాయి. సంస్కరణకు బీజం వేశాయి. మరణించిన, ఎన్నికల్లో గెలిచి ఒకరు చరిత్ర సృష్టించారు.

Update: 2024-03-31 17:43 GMT
Source: Twitter

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: జాతీయ ఉద్యమంలో రాయలసీమకు కూడా చారిత్రిక నేపథ్యం ఉంది. పాలన వ్యవహారాల్లో కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తమదైన ముద్ర వేశారు. వీటన్నిటికీ మరకగా మారిన రక్తాక్షరాలను సంస్కరణలతో తుడిచి వేశారు. కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలకు పునాది పడేలా చేశాయి. ఇవి దేశ భద్రతతో పాటు, ఎన్నికల నిర్వహణలోనూ మార్పులు తెచ్చాయి. రాయలసీమలోనే కాదు. దేశ చరిత్రకు కళంకంగా మారిన నేర స్వభావాన్ని తుడిచి పెట్టడానికి బాటలు పడ్డాయి. మూడు సంఘటనలతో... దేశం మొత్తం రాయలసీమ ప్రాంతం వైపు దృష్టి సారించింది. ఆ సంఘటనల తీవ్రతను కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, దేశ భద్రత వ్యవస్థ కూడా దీర్ఘాలోచనలో పడింది. దేశ ప్రతిష్ట, భద్రతకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైన పరిస్థితుల్లో... వాటిని ఒకసారి పరిశీలిద్దాం.

మరణించినా.. ఎన్నిక ఆగదు..

ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి మరణించిన ఎన్నికల ప్రక్రియ ఆగదు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ పరిస్థితి రావడానికి కడప జిల్లాలో జరిగిన సంఘటన ఎన్నికల సంస్కరణలకు అవకాశం కల్పించింది.


కాజీపేట ఘటన.. కడపలో ఆగిన ఎన్నిక

1991లో కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా సీ రామచంద్రయ్య ఉన్నారు. ఎన్నికల సమరం తారస్థాయికి చేరింది. పట్టు కోసం తెలుగుదేశం. ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు హోరాహోరీగా శ్రమించారు. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల తేదీకి ఒకరోజు ముందే నిబంధనల ప్రకారం ప్రచారం ఆగిపోయింది. ఇంకొన్ని గంటల్లో అంటే తెల్లవారితే పోలింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల సిబ్బంది కూడా సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అంతకు ముందు రోజు సాయంత్రం ఓ స్వతంత్ర అభ్యర్థి హత్యకు గురయ్యాడు. కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన పోలంకి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా ఆ సీటు నుంచి పోటీలో ఉన్నారు.

ఇంటి నుంచి కడపకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో అదృశ్యమయ్యారు. పొలాల్లో ఆ మృతదేహం లభ్యమైంది. ఆ నోట ఈ నోట ఈ సమాచారం బయటకు వచ్చి గుప్పుమంది. పోలీసులు కూడా పోలంకి వెంకట సుబ్బయ్య మరణాన్ని ధ్రువీకరించారు. ఈ సమాచారం అందిన వెంటనే అప్పటి జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం (డాక్టర్ వైయస్సార్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు) కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. అంతే, అదే రోజు రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కడప ఎన్నిక ఆగిపోయింది.

సంస్కరణ

హత్యకు గురైన పోలంకి వెంకటసుబ్బయ్య కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీర్ఘ దృష్టితో ఆలోచన చేసింది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టు పెట్టడం ద్వారా లబ్ధి పొందడానికి ఇలాంటి కిరాతక ఆలోచనలు చేస్తారేమో అని కేంద్ర ఎన్నికల సంఘం సందేహించినట్లు ఉంది. ఒక ఎంపీ స్థానంలో ఎన్నిక నిర్వహణకు రూ. కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్వతంత్ర అభ్యర్థి మరణించడం వల్ల ఎన్నిక ఆగింది. దుబారా ఖర్చు నివారణతో పాటు, స్వతంత్ర అభ్యర్థుల రక్షణ కోసం అన్నట్లు... అభ్యర్థి మరణించినా ఎన్నిక ఆగదని ఆదేశాలు జారీ చేసింది. మరో సంఘటనలో..


కింకర్తవ్యం... చనిపోయిన.. గెలిచి..

భూమా శోభా నాగిరెడ్డి చురుకైన నాయకురాలు. 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో డిప్యూటీగా కూడా పనిచేశారు. మరణించి కూడా ఆమె ఎన్నికల్లో గెలిచి దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు.

ఏం జరిగిందంటే..

ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. 2012లో వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకం. శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ఆమె వైయస్ షర్మిల రెడ్డితో కలిసి నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటలకు నంద్యాల నుంచి ఆమె ఆళ్లగడ్డకు వాహనంలో బయలుదేరారు. ఆమె ప్రయాణించే కారుకు వెనుక ముందు పోలీస్ ఎస్కార్ట్ ఉంది. దీప గుంట గ్రామ సమీపానికి వచ్చేసరికి.. రైతులు ఆరబోసిన ధాన్యం గుట్టల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకు వెళ్లి అదుపుతప్పింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 24వ తేదీ 11 గంటలకు తుది శ్వాస విడిచారు.

మరణాన్ని జయించలేకున్నా..

ఓటర్ల మనసులు గెలిచి..

కడప ఘటన నేపథ్యంలో అభ్యర్థి మరణిస్తే ఎన్నికల వాయిదా వేయకుండా సంస్కరణ తీసుకువచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న శోభా నాగిరెడ్డి మరణించారు. అప్పటికే పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఏమి చేయాలనే దానిపైన ఆ సందిగ్ధత ఏర్పడింది ఎన్నికల కమిషన్ కూడా ఎటు తేల్చలేకపోయింది. ఎన్నిక నిర్వహించాల్సిందేనని నిర్ణయించారు. తల్లిని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూనే.. శోభా నాగిరెడ్డి కుమార్తెలు భూమా అఖిలప్రియ, భూమా నాగ మౌనిక ఇంటింటి ప్రచారం సాగించారు. చనిపోయిన వ్యక్తి ఇక రాదని తెలుసు. అయినా ఆళ్లగడ్డ ఓటర్లు శోభా నాగిరెడ్డికి పట్టం కట్టారు. చనిపోయిన శోభ నాగిరెడ్డిని 92,108 మెజారిటీతో గెలిపించారు.

సందిగ్ధం

మరణించి కూడా గెలిచిన శోభా నాగిరెడ్డి విజయ గాధ ఎలక్షన్ కమిషన్‌నే కాదు దేశ ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భూమా అఖిలప్రియ విజయం సాధించారు. ఈ ఘటనలో ఎలక్షన్ కమిషన్ సందిగ్ధంలో పడిపోయింది. మరో సంఘటనతో టెలికాం రంగంలో సంస్కరణలకు బీజం పడింది.

ఉలిక్కిపడిన దేశం..!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీ. ఇందుకోసం 2003లో అప్పటి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చారు. రోడ్డు మార్గాన ఆయన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి టోల్గేట్ దాటంగానే కొద్ది దూరం వెళ్ళాక సాయంత్రం 4.20 గంటలకు చంద్రబాబు నాయుడు లక్ష్యంగా అమర్చిన క్లే మోర్ మైన్‌లను న్నక్సలైట్లు (మావోయిస్టులు) పేల్చారు. చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు తుక్కుతుక్కయింది. కారులో ఉన్న ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి కొత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి గాయపడ్డారు. ఈ సంఘటన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు సంఘటన జరిగిన రోజు సమీప ప్రాంతాల నుంచి సెల్ ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.


సిమ్ కార్డుకు... ఆధార్

ఆ సంఘటన జరిగే వరకు సెల్ కంపెనీలు కూరగాయల మాదిరి సిమ్ కార్డులు జారీ చేశాయి. ఆ సిమ్ కార్డులో వాడుతున్న వ్యక్తులను విచారణ పేరున పిలిపించి వేదన గురి చేశారు. అప్పటికే ఒక్కో నంబర్ చాలామంది చేతులు మారింది. దీంతో కొన్ని రోజుల పాటు అమాయకులు కూడా అకారణంగా వేధింపులకు గురయ్యారు. విచారణ చేయడం పోలీసుల ధర్మం వారు అదే చేశారు. అందులో తప్పులేదు. కానీ అసలైన నిందితులను గుర్తించడానికి చాలామందిని విచారణ చేయాల్సిన సందర్భం ఏర్పడింది. ఈ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం, సమాచార మంత్రిత్వ శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకొని సిమ్ కార్డు జారీకి తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉండాలని సంస్కరణ తీసుకొచ్చి అమలు చేసింది.

దీంతో సెల్‌ఫోన్ రంగంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ సంఘటన కూడా దేశంలో సంస్కరణలకు బీజం వేసింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నష్ట నివారణ చర్యలు దిగడానికి అంటే ముందే.. అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో అరాచకాలు సృష్టించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విషయాన్ని ఈ సంఘటనలు చెప్పకనే చెప్పాయి. ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనలు దేశంలో మార్పులు, సంస్కరణలకు తీసుకురావడానికి దోహదం చేశాయి.

Tags:    

Similar News