ఏపీలో పిడుగుపాటు వర్షాలు..ఎక్కడంటే
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.;
By : The Federal
Update: 2025-04-16 15:32 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు పిడుగుపాటు వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బుధవారం రాత్రి 8 గంటల నాటికి అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిమీ, తిరుపతి జిల్లా పూలతోటలో 41మిమీ, అనకాపల్లి జిల్లా మాడుగులలో 36.5మిమీ చొప్పున వర్షపాతం నమోదయిందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో 40డిగ్రీల కంటే మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కర్నూలులో 40.7డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 40.4డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్ట, మూలవంక, ఖాజీపేటలో 40.3డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.
ఒక పక్క అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు పిడుగుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.