తిరుపతి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలో పెట్టిన పేర్లను మార్చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం తిరుపతి ఫ్లైఓవర్ పేరును మార్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంలోని పలు పథకాలకు, సంస్థలకు ఇప్పటికే పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం తాజాగా తిరుపతి ఫ్లైఓవర్ పేరును కూడా మార్చింది. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అని ఉన్న పేరును ‘గరుడ వారధి’గా మార్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2018లో గరుడ వారధి పేరుతో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గరుడ వారధి పేరును మార్చాలని నిర్ణయించుకుంది. దానికి బదులు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌గా మార్చింది. గరుడ వారధి అనే పేరు బాగ లేదని, అందుకే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మార్చామని నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం పెట్టిన శ్రీనివాస సేతు పేరును తీసేసి, గత టీడీపీ హయాంలో పెట్టిన గరుడ వారధి పేరును మళ్లీ పెట్టడం గమనార్హం.