Pawan Kalyan's state tour | జిల్లాల పర్యటన.. జనసేనాని.సీక్రెట్ ఏమిటి?
రాయలసీమలో డిప్యూటీ సీఎం తన కార్యాచరణ ప్రకటించారు. నియోజకవర్గంలో మకాం వేస్తా అంటున్న డిప్యూటీ సీఎం;
By : The Federal
Update: 2025-03-22 08:38 GMT
రాయలసీమ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ పక్రటించినట్లు కనిపిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర పర్యటన చేపడతానని డిప్యూటీ సీఎం ప్రకటించారు రాష్ట్ర పర్యటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జిల్లాలతో పాటు. నియోజకవర్గాల్లో కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటానని ఆయన కార్యాచరణను వెల్లడించారు. తాను బస చేసే గ్రామంలోనే టెంటు వేసుకుని ప్రజలతో మమేకం అవుతానని ఆయన తన మనసులోని మాటలను వెల్లడించారు. తద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం తోపాటు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కర్నూలు జిల్లాలో ఒకరోజు పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం వచ్చారు. ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలుకు విమానాశ్రయానాకి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ఓర్వకల్లు మండలం పూడిచెర్లకు చేరకున్నారు. అక్కడ రైతు సూర్యరాజు వ్యవసాయ పొలంలో సిద్దం చేసిన ఫారంపాండ్కు భూమి పూజ చేశారు.
అనంతరం జరిగిన సభలో ఆయన అనేక ఆసక్తి అంశాలపై మాట్లాడారు. పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యవసాయం, కులాల సమస్యలపై ఆయన తన సహజసిద్ధ మాటలతో సీఎం ఎన్. చంద్రబాబును కీర్తించడానికే ఎక్కువ సమయం ఇచ్చారు.
షెడ్యూల్డు కులాల రిజరేషన్ల వర్గీకరణ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అనేక కుల సమస్యలపై కూడా మాట్లాడారు. గాజుల బలిజ, బుడగ జంగాలకు రిజర్వేషన్లలో న్యాయం చేసే విధందా సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ తరువాత రాష్ట్రంలో బుడగ జంగాల స్థితి దయనీయంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ కులాలకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. రాయలసీమలో తిరుపతి, కడప జిల్లా రైల్వే కోడూరులో కూడా జనసేన ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ జిల్లాలతో పాటు, రాయలసీమలో పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రధానంగా బజలి (కాపు) సామాజికవర్గం అభ్యర్థుల విజయాల నిర్ణాయకశక్తిగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో జిల్లాలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనపై ఆయన పవన్ కల్యాణ్ నోటి నుంచి ఊమించని ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి స్వయంగా పర్యవేక్షించడం ద్వారా ప్రస్తుతం ఉన్న బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తారా? లేక ఆయన మదిలోని ఆలోచన ఏమిటనే విషయంలో కూటమిలోని పార్టీల్లో గుబులు రేపినట్లే కనిపిస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణ, ప్రయాణం ఎలా ఉంటుందనే విషయంలో ఆయన మాటలు ఆసక్తి రేకెత్తించడమే కాదు. మిత్రపక్ష పార్టీల్లో కూడా చర్చకు ఆస్కారం కల్పించినట్లే కనిపిస్తోంది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి.