ఆంధ్ర ఎన్నికల్లో పిఠాపురం పోటీ అత్యంత ప్రముఖంగా మారింది. ఇరు పార్టీల నుంచి కాపు నేతలే బరిలోకి దిగడం ఇందుకు ప్రధాన కారణమైనా.. ఈ పోటీలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వంగా గీత తలపడం అసలు కారణం. దానికి తోడుగా పవన్‌ను ఎలాగైనా చిత్తు చేయడానికి వైసీపీ కూడా శత్రు దుర్బేధ్యమైన వ్యూహాలను రచిస్తోంది. వీటిలో భాగంగానే వంగీ గీతకు సపోర్ట్‌గా స్థానికంగా భారీ ఫాలోయింగ్ ఉన్న నేతలను నిలబెడుతోంది. దాంతో పాటు ముద్రగడ పద్మనాభంను కూడా పిఠాపురం ఎన్నికల్లోకి పంపింది. పిఠాపురంలో వైసీపీ చేపట్టాల్సిన సభలు, ర్యాలీలు, ఇవ్వాల్సిన ప్రసంగాల పాయింట్లు అన్నింటిని ముద్రగడ ప్రత్యేక పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పార్టీ విజయాన్ని ఖరారు చేస్తారు. అయితే తాజాగా పిఠాపురంలో పవన్ తన ప్రచారన్ని జోరుగా ప్రారంభించారు. ఇదే క్రమంలో వంగా గీత కూడా ప్రచార బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆమె పవన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
నేనేం చేశానో ప్రజలకు తెలుసు
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వంగా గీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ‘‘పవన్ మాటలు పిఠాపురంను అప్రతిష్టపాలు చేసేలా ఉన్నాయి. నిజానిజాలు తెలుసుకుని పవన్ మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరికాదు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో పిఠాపురం కోసం ఏం చేశాను అన్నది ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు’’అని వ్యాఖ్యానించారు వంగా గీత. ఆమె వ్యాఖ్యలతో పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి. పవన్, గీత మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈ ఎన్నికలను ఇరు వర్గాల కార్యకర్తలు, నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
పిఠాపురం అభివృద్ధే నా అజెండా
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడటంతోనే ప్రజలకు నష్టం జరిగిందని, వాలంటీర్లు దూరం కావడంతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని వ్యాఖ్యానించారు వంగా గీత. పిఠాపురం అభివృద్ధి కోసం తన దగ్గర ప్రత్యేక అజెండా ఉందని స్పష్టం చేశారు. ‘‘డబ్బులు, కంటైనర్లు అంటూ ప్రజలను చులకన చేసేలా పవన్ మాట్లాడుతున్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అనడం సరికాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు గెలిస్తే పిఠాపురం ప్రజలకు పవన్ ఏం చేస్తారో చెప్పాలి. సినిమా డైలాగులు రియల్ పాలిటిక్స్‌లో పనిచేయవు. ప్రాస కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పవన్‌పై లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నా. అందులో డౌట్ అక్కర్లేదు’’అని ధీమా వ్యక్తం చేశారు.