కరెంటు స్తంభం తీగలపై వెంకన్న విన్యాసం
ఓ వ్యక్తి కరెంటు స్తంభంపైకి ఎక్కి తీగలపై పడుకున్నాడు. దీంతో అక్కడి వారు బెంబేలెత్తారు.;
తాగని నాకొడుకెందుకు లోకంలో స్వర్గలోక మగపడతది మైకంలో అంటూ ఓ సినిమాలో పాట ఉంది. తాగకపోతే ఏమో కానీ తాగితే స్వర్గలోకం సంగతి దేవుడెరుగు... ఓ వ్యక్తి ఏకంగా కరెంటు తీగలపై విన్యాసాలు చేసి నాకేమౌతుందని అందరినీ ఆశ్చర్య పరిచాడు. మందు మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇలా చాలామంది మద్యం సేవించి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. చూసేవాళ్లకు కొన్నిసార్లు ఇవి గమ్మత్తుగా ఉన్నా, మరి కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
ఫుల్లుగా మద్యం తాగి గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద ఉన్న భవనం పైకి ఎక్కాడు. విద్యుత్ తీగలు అందుబాటులో ఉండటంతో ఏకంగా కరెంటు స్తంభం తీగల పైభాగానికి ఎక్కి విన్యాసాలు చేశాడు. రోడ్డున్న పోయే వారు, చుట్టుపక్కల ఇండ్లలోని వారు ఎంత అరిచినా పట్టించుకోలేదు. కిందకు దిగాలని ఎంత వారించినా అరిచే వారు పిచ్చోళ్లన్నట్లుగా చూశాడు. కాసేపు అటూ ఇటూ తీగలపై తిరిగి ఏకంగా తీగలపై అడ్డంగా పడుకున్నాడు.
పాలకొండ మండలం ఎం సింగపురం గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్న వ్యవసాయ కూలీ. బాగా మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో తగాదా జరిగింది. ఇలా రోజూ తాగొస్తే ఎలాగంటూ భార్య, పిల్లలు నిలదీశారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ తీగలపై ఎక్కాడు. అంతకు ముందే కరెంటు పోయింది. తీగలపైకి వెంకన్న ఎక్కించి చూసిన జనం క్షణాల్లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ తీగలపై పడుకున్న వెంకన్నను స్థానికులు ఎలాగోలా చిన్నగా కిందకు దించి నాలుగంటించారు. నన్నెందుకు కొడుతున్నారని వారిపై తిరగబడ్డాడు. తాగితే ఈ రకంగా మైండ్ పనిచేస్తుందా? అంటూ అందరూ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బంధువుల గుండెల్లో ఆ కొద్దిసేపు రైళ్లు పరుగెత్తించాడు వెంకన్న.