జగన్‌ను ఇరకాటంలో పెట్టిన విజయసాయిరెడ్డి ట్వీట్

ఆంధ్రకు ప్రత్యేక హోదాపై ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి. అది సీఎం జగన్‌కు తలనొప్పిగా మారుతోందా?

Update: 2024-03-24 08:35 GMT
Source: Twitter

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇది ప్రత్యేక టాపిక్‌గా నిలుస్తుంటుంది. ప్రత్యర్థులను ప్రశ్నించడానికి కూడా ఆంధ్ర ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఒక బ్రహ్మాస్త్రమనే చెప్పాలి. దీనిని ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ నిజం చేస్తోంది. ఎన్నికలకు మరో 56 రోజులు ఉండగా ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ‘‘కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పింస్తుందని వాళ్ల మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఛాలెంజ్ చేస్తున్నాను. కానీ వాళ్లు అలా చేయరు. ఎందుకంటే వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తు కన్నా కూటమే వాళ్లకు ముఖ్యం. ఓటర్లు అందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే పార్టీకే ఓటు వేయాలి. వైఎస్ఆర్‌సీపీ పార్టీకే ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ బూమరాంగ్‌లా తిరిగా ఆయనపైకే వస్తోంది. ఎన్నికలు దగ్గర పడినప్పుడే విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ ఎందుకు చేశారు? జగన్‌ను ఇరుకున పెట్టడానికే ఆయన ఈ ట్వీట్ చేశారా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆ బాధ్యత మీది కాదా?
విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అధికారంలో ఉన్న మీరు తీసుకురావాలా.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు తీసుకురావాలా అని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు ఏం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారని ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తన మెడలే వంచుకున్నారంటూ సెటైర్లు వేశారు.


జగన్ ఏమన్నారంటే!
2019 ఎన్నికల ప్రచారంలో తమ పార్టీని 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో కొట్లాటకు కూడా వెనకాడమని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎండమావిలా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఢిల్లీ పెద్దలను ఆహ్వానించడానికి 2019 మే నెలలో హస్తినకు వెళ్లిన జగన్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 250 సీట్లు వచ్చి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు వాళ్లకు ఇతర పార్టీల మద్దతు అవసరం ఉండేది. అప్పుడు ప్రత్యేక హోదాపై సంతకం చేస్తేనే మద్దతు ఇస్తామని కండిషన్ పెట్టేవాళ్లం. కానీ అలాకాకుండా ఎవరి అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా 303 స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయలేకున్నాం. కానీ ఈ అంశాన్ని అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రం ముందుకు తీసుకొస్తాం. లేకుండా ఆంధ్రకు ప్రత్యేక హోదా అనే విషయం మరుగున పడుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’’అని అన్నారు జగన్. అయితే అమరావతి రాజధానిలో శంకుస్థాపన చేయడానికి 2015 అక్టోబర్ 22న వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ‘‘రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని తూచా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం. మోడీ, చంద్రబాబు జోడీ ఈ అంశాలన్నింటినీ నెరవేర్చి తీరుతుంది’’అని ప్రధాని మోదీ చెప్పారు.
జగన్‌ను ఇరుకున పెట్టడానికేనా!
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు విజయసాయి ట్వీట్ చేయడానికి అసలు కారంణం ఏంటి.. సీఎం జగన్‌ను ఇరకాటంలో పడేయటమే ఈ ట్వీట్ ఆంతర్యామా అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న సీఎం జగన్ ఏం చేయలేదని విజయ్ తన ట్వీట్ ద్వారా పరోక్షంగా ప్రశ్నిస్తున్నారా? లేకుంటే జగన్‌వి మాటలే తప్ప చేతలు శూన్యమని అంటున్నారా? అసలు ఇప్పుడు ఈ ట్వీట్ చేయాల్సినంత అవసరం ఏం వచ్చింది? రానున్న ఎన్నికల్లో ఓడిపోతామేమో అన్న భయంతోనే విజయ్ ఇలా చేశారా? ఇలా చెప్పుకుంటూ పోతే విశ్లేషకులు, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు మరెన్నో. ఇటీవల పార్లమెంటులో విజయ్‌సాయి రెడ్డి.. బీజేపీకి భారీగా సపోర్ట్ ఇచ్చారు.. కావున ఆయన బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దమయ్యే ఈ ట్వీట్ చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో విజయసాయిరెడ్డే చెప్పాలి.


Tags:    

Similar News