విజృంభిస్తున్న విషజ్వరాలు.. నిలదీస్తున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. వివిధ ప్రాంతాల్లో విషజ్వరాల బారిన పడిన వారి సంఖ్య విపరీతంగా ఉంది.

Update: 2024-07-05 10:21 GMT

ఆంధ్రప్రదేశ్‌లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. వివిధ ప్రాంతాల్లో విషజ్వరాల బారిన పడిన వారి సంఖ్య విపరీతంగా ఉంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్న చిన్నారులు అధికంగా ఈ విషజ్వరాల బారిన పడటం తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో విషజ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వీటి నివారణకు ప్రభుత్వం ఎలాటి చర్యలు తీసుకుందని ప్రజలు నిలదీస్తున్నారు. సీజనల్ వ్యాదుల ప్రబలుతున్న క్రమంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల పరిసరాల పారిశుధ్యంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

మన్యం జిల్లాలో మితిమీరిన స్థితి

మన్యం జిల్లాలో విషజ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే భారీగా విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడ్డారు. రాష్ట్ర ప్రజలకు మొన్నటి వరకు డయేరియా పీడకలలా మారింది. ఇప్పుడు విషజ్వరాల భయపెడుతున్నాయి. వీటిపై ప్రజలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. సంబంధిత అధికారులతో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. విషజ్వరాలు ప్రబలడానికి మూల కారణం ఏంటో తెలుసుకొని దాని నిర్మూలనకు కృషి చేయాలని చెప్పారు. అదే విధంగా పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో విషజ్వరాల పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని వెల్లడించారు. ఈ నివేదికలో కచ్చితమైన సమాచారం ఉండాలని కూడా హెచ్చరించారు.

కార్యక్రమాలు నిర్వహించండి

అదే విధంగా విషజ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు నారాయణ. విషజ్వరం సోకిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వంటి అంశాలను ప్రజలకు నేర్పించాలని, దాంతో పాటు పరిసరాల పరిశుభద్రతపై కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా అర్థమయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నారాయణ. సీజనల్ వ్యాధులను హ్యాండిల్ చేయడంలో మున్సిపల్ అధికారుల వైపు నుంచి అలసత్వం, నిర్లక్ష్యం వంటి వాటికి తావు ఉండకూడదని, ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

ఔషధ నిల్వలు ఎలా ఉన్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు ఉధృతం అవుతున్న క్రమంలో ఆసుపత్రుల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు స్టాక్‌లో ఉండేలా చూసుకోవాలని వైద్య శాఖ అధికారికి సూచించారు. ఈ విషయంపై సదరు శాఖ మంత్రితో తాను చర్చిస్తానని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఔషధాలు పుష్కలంగా అందేలా చర్యలు తీసుకోవాలని సదరు మంత్రిని కోరతానని చెప్పారు. మున్సిపల్ పరిధిలో మాత్రం చాలా పరిశుభ్రంగా ఉండాలని, విషజ్వరాల కేసులు అదుపు కావడంతో పాటు కొత్తవి రాకుండా చూసుకోవాలని, అవసరం అయితే వైద్యులు, అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించాలని కూడా సూచించారు.

Tags:    

Similar News