విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, అరెస్ట్ తప్పదా?

వైసీపీ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చుబిగిస్తోంది. ఏ నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ఉందంటున్నారు.

Update: 2024-10-22 03:08 GMT

వైసీపీ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చుబిగిస్తోంది. విశాఖలో వృద్థులు, అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన ‘హయగ్రీవ’ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ప్రారంభించింది. సత్యనారాయణ, ఆయన ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ), మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గద్దె బ్రహ్మాజీలు మోసపూరితంగా ‘హయగ్రీవ ప్రాజెక్టు’ను స్వాధీనం చేసుకుని తప్పుడు పత్రాలతో బినామీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.

ఫిర్యాదులో ఏముందంటే..
ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51ఎకరాల భూమిని తమ నుంచి లాక్కున్నారంటూ ఈ ఏడాది జూన్‌ 22న చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనపై అక్టోబర్ 19న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సుమారు 24 గంటలపాటు ఐదు చోట్ల ఎంవీవీ, జీవీల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసింది. సోదాలు నిర్వహించింది.
‘2008లో హయగ్రీవ ఫామ్స్‌ డెవలపర్స్‌ సంస్థకు వృద్ధులు, అనాథల కాటేజీల కోసం ఎండాడలో భూమిని ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించింది. 2010లో ‘హయగ్రీవ’ రూ.5.63 కోట్లు చెల్లించగా, రిజిస్ట్రేషన్‌ నాటికి ఆ ఆస్తి విలువ రూ.30.25 కోట్లుగా ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.200 కోట్లపైగా విలువ ఉన్న ఈ భూమిని ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్ల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి ప్లాట్లుగా విభజించి వివిధ వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించారు. ఇలా అమ్మిన ప్లాట్లతో నేరపూరితంగా రూ.150 కోట్లకుపైగా ఆర్జించారు’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
ఈడీ సోదాల్లో 300పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులను ఈడీ స్వాధీనం చేసుకుంది. స్థిరాస్తుల కొనుగోలుకు రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. బినామీ పట్టాదారు పాసుపుస్తకాలు, డిజిటల్‌ పరికరాలు కొన్ని గుర్తించామని, వాటితో సహా వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ తెలిపింది.
కుటుంబ సభ్యుల కిడ్నాప్...
సత్యనారాయణ గత లోక్ సభలో సభ్యుడు. వైసీపీ తరఫున గెలిచారు. ఆస్తుల వివాదంలో ఆయన కుటుంబ సభ్యులను ఆయన ఇంట్లోనే బంధించడం ఆనాడు పెద్దకలకలం సృష్టించింది. ఆయన భార్య, కుమారుడు, ఆయన ఆడిటర్ జీవీని ఇంటి నుంచి తీసుకువెళ్లారు కిడ్నాపర్లు. ఆ తర్వాత అది కిడ్నాప్ గా గుర్తించారు. అయినప్పటికీ ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా కేసును ఉపసంహరించుకుని కుటుంబ సభ్యులను విడిపించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఇకపై విశాఖపట్నంలో వ్యాపారం చేయనని ప్రకటించి చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన వైసీపీ ఓడిపోవడంతో కేసులన్నింటినీ బయటకు తీస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేరపూరిత పత్రాలు వాస్తవమే అని తేలితే ఎంవీవీ సత్యనారాయణ మున్ముందు చట్టపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News