హోం మంత్రి అనితను కలిసిన వివేకా కూతురు సునీత.. జగన్ జుట్టు కూటమి చేతుల్లోకి వెళ్లినట్లేనా..

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చేస్తామంటూ సునీతకు హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.

Update: 2024-08-07 08:40 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. తన తండ్రికి న్యాయం చేయడానికి తాను ఐదేళ్లుగా పోరాడుతున్నా అప్పటి సీఎం వైఎస్ జగన్ మాత్రం ఏమాత్రం సహాయం చేయలేదంటూ వైఎస్ షర్మిలతో కలిసి సునీత ఎన్నికల ప్రచారంలో పలుమార్లు పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో వైఎస్ భారతి ప్రధాన పాత్ర పోషించారని, హంతకులను జగన్ రక్షిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ఈ వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. హోం మంత్రి వంగలపుడి అనితను.. సునీత ఈరోజు మదర్యాదపూర్వకంగా కలవడమే ఈ మార్పు. ఈ భేటీలో తన తండ్రి వివేకానందరెడ్డి హత్య గురించే సునీత వివరించారు. అంతేకాకుండా వైసీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా సునీత రెడ్డి సవివరంగా హోం మంత్రికి తెలియజేశారు.

‘పోలీసులపై చర్యలు తీసుకోవాలి’

‘నా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారితో పాటు పలువురు కీలక నేతలు కూడా హంతకులను కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఆఖరికి సీబీఐపైనే కేసులు నమోదు చేయించారు. సాక్ష్యులను బెదిరించారు. వారందిరిని కఠినంగా శిక్షించాలి. వివేకానందరెడ్డికి న్యాయం చేయాలి’’ అని సునీత కోరారు.

ఇదిలా ఉంటే.. ‘‘జగన్‌పై రాయితో దాడి జరిగిందని రాష్ట్రమంతా నానా హంగామా చేస్తున్నారు. అలాంటిది నా తండ్రిపై జరిగిన గొడ్డలి దాడి గురించి నేనెందుకు ఆందోళన వ్యక్తం చేయకూడదు. ఎందుకు మాట్లాడకూడదు. ఎందుకు న్యాయం కోరకూడదు. ఇలా ప్రశ్నించినందుకే నేను టీడీపీలో చేరానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నాన్నకు న్యాయం చేయడానికి ఎవరినైనా కలుస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. అదే విధంగా జగన్‌ను కూడా కలవడానికి ప్రయత్నించాం. కానీ ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. చెల్లిగా కాదు ఆంధ్రప్రదేశ్ పౌరురాలిగా అనుమతి కోరినా జగన్ కలవడానికి నిరాకరించారు. హంతకులను ఆయన కాపాడుతున్నారు. హంతకుల్లో అవినాష్ రెడ్డి కూడా ఒకరు. అవినాష్‌ను అరెస్ట్ కాకుండా ఉండటానికి జగన్ ఎన్నో చేశారు. సీబీఐపై కూడా కేసులు పెట్టారు’’ అంటూ సునీత గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సందర్బంగా తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఈరోజు హోం మంత్రి అనితను కలిసి తన స్థితిని వివరించారు.

శిక్ష పడేలా చేస్తాం: అనిత

సునీత రెడ్డితో భేటి తర్వాత ఆమెకు హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు. న్యాయం జరిగేలా తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘సునీత తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి వివరించారు. అదే విధంగా పోలీసులను హంతకులను ఆదుకున్నారని ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన సీబీఐపై అక్రమ కేసులు పెట్టి విచారణను ముందుకు సాగకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఆమె కేసులో అన్యాయంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసు సీబీఐ విచారణలో ఉన్న క్రమంలో కేసుకు సంబంధించి పూర్తి సహకారం అందిస్తాం. దోషులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుంది. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టం’’ అని తెలిపారు.

న్యాయం గెలవబోతోంది: సునీత

హోం మంత్రితో భేటీ అనంతరం త్వరలోనే న్యాయం గెలవబోతోందంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. తన ఇన్నేళ్ల నిరీక్షణకు సత్ఫలితాలు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో త్వరలోనే దోషులకు శిక్ష పడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో సీబీఐ చేయాల్సింది చాలా ఉంది. ఆధారాలు ఉన్నా న్యాయం లభించడానికి ఆలస్యం కావడం బాధాకరం. కానీ ఇప్పటికైనా న్యాయం గెలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏపీ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదు. నా తండ్రి వివేకానంద రెడ్డి హత్యే కాదు.. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య వంటివి ఏపీలో చాలా జరిగాయి. ఏపీ ప్రజలు మేలుకోవాలి’’ అని ఆమె తెలిపారు.

జగన్ జుట్టు కూటమి చేతులోనా..

ఈరోజు సునీత రెడ్డి.. హోం మంత్రి వంగలపూడి అనితను కలవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక జగన్ పని అయిపోయినట్లే అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. ఈ దెబ్బతో జగన్ జుట్టు కూటమి చేతుల్లోకి వెళ్లినట్లేనని అంటున్నారు. ఇప్పటికే జగన్‌ ఎలా దొరుకుతారా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి.. వివేకా హత్య కేసు అద్భుత అవకాశంగా మారానుందన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసును అడ్డుకుపెట్టుకుని జగన్ నోరు మూయించడానికి కూటమి ప్రయత్నించొచ్చని కూడా కొందరు మేధావులు చెప్తున్నారు. కాకపోతే.. ఎవరు ఎన్ని చెప్పుకున్నా.. జగన్ తప్పు చేయలేదు కాబట్టి భయపడరని వైసీపీ శ్రేణులు ధైర్యం కనబరుస్తున్నాయి. మరి ఈ అంశంపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

2019లో జరిగిన వివేకా హత్య

మార్చి 15, 2019 రాత్రి మాజీ మంత్రి వివేకానందరెడ్డి తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డల్లతో దాడికి పాల్పడ్డారు. అయితే వివేకానందరెడ్డి హత్యపై అప్పట్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకాను టీడీపీనే హత్య చేయించిందని కూడా ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ కూడా చేశారు. తీరా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. 151 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. అక్కడి నుంచి వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తు వేగం తగ్గడం ప్రారంభించింది. అనతికాలంలోనే నత్తనడకకు చేరుకుంది. సీబీఐ విచారణ విషయంలో సీఎం హోదాలో ఉండి కూడా జగన్ వెనకడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి అనేక మంది పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. సీబీఐ రంగంలోకి దిగిన కొన్ని రోజులకే దర్యాప్తు ఆగిపోయింది. దీంతో వివేకానందరెడ్డి కూతురు సునీత రెడ్డి.. కోర్టుల చుట్టు తిరుగుతూ.. సీబీఐ చీఫ్‌ను కలిసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ కేసు విచారణలో కదలికలు మొదలయ్యాయి. కానీ ఇప్పటికి కూడా ఈ కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు.

Tags:    

Similar News