ఓటేయడానికి ఓటరు కార్డే కావాలా!

తెలుగు రాష్ట్రాలు పోలింగ్ పండగకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు. అదెలా అంటే..

Update: 2024-04-28 14:03 GMT

భారతదేశమంతా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలు ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. అతి త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రలో లోక్‌సభ సహా అసెంబ్లీ ఎన్నికలూ జరుగనున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రతి పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలబడనున్న అభ్యర్థులు తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పండగ జరగనుంది. ఈ క్రమంలోనే 18 ఏళ్ల వయసు దాటి ఓటు వేయడానికి హక్కు సంపాదించుకున్న ప్రతి ఓటరుకు పలు సందేహాలు వస్తున్నాయి. ఓటు వేయాలంటే ఓటరు కార్డు తప్పనిసరీనా? ఇన్ని కార్డులు ఉన్నప్పటికీ మరే ఇతర కార్డు సహాయంతో ఓటు వేయలేమా? అన్న సందేహాలు వారికి కలుగుతున్నాయి.

ఓటరు కార్డు తప్పనిసరినా!

ఓటు వేయడానికి ఓటరు కార్డు తప్పకుండా కావాలా అంటే అవసరం లేదనే చెప్తోంది ఎన్నికల సంఘం. ఓటరు కార్డు లేకున్నా దాదాపు 13 రకాల కార్డుల్లో ఏదో ఒక్క కార్డు ఉన్నా ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని దేశ ఎన్నికల సంఘం చెప్తున్నారు. ఓటు ప్రతి వ్యక్తికి ఒక వజ్రాయుధమని, అటువంటి ఆయుధాన్ని వినియోగించుకోవడానికి ఓటరు కార్డు తప్పకుండా ఉండాలనడం కాస్త ఇబ్బందికర విషయమని, ఓటరు కార్డు లేని వారు కూడా ఓటు వేసేలా చేసి పోలింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటు వేయడానికి ఓటరుకు కావాల్సిన కార్డులు..

ఓటరు గుర్తింపు కార్డు

ఆధార్ కార్డు

పాన్ కార్డు

ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు

సేవా గుర్తింపు కార్డు

బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్

ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు

డ్రైవింగ్ లైసెన్స్

పాస్‌పోర్ట్

ఎన్‌పీఆర్ కింద ఆర్టీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు

పెన్షన్ డాక్యుమెంట్

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్నికలకు అధికారులు జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు కార్డులు

ఉపాధి హామీ జాబ్ కార్డు

వీటిలో ఏ ఒక్క కార్డు ఉన్నా సదరు ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

అందరికీ సెలవు

మే 13న పోలింగ్ జరగనున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంస్థలకు సెలవు దినంగా కార్మిక శాఖ ఉపకమిషనర్ శ్రీకాంత్ నాయక్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనడానికే ఆరోజు సెలవుగా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఓటరు పోలింగ్ డేట్‌ను గుర్తుంచుకుని తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేయడం అంటే వేలుపైన ఇంక్ వేయించుకోవడం కాదని, రానున్న ఐదేళ్లలో మన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని శాసించడమని ఆయన చెప్పారు.

Tags:    

Similar News