వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
వికసిత్ భారత్ కంటే విజన్ 2047 డాక్యుమెంట్‌కు అత్యధికంగా వ్యూస్ వచ్చాయి.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి సచివాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.
విజన్ 2047 డాక్యుమెంట్‌కు వచ్చినన్ని వ్యూస్ వికసిత్ భారత్‌కు కూడా రాలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆన్‌లైన్‌లో 16లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కూటమి సర్కార్ ప్రధాన లక్ష్యమన్నారు. అంతేకాకుండా 42వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యమన్నారు. ఇది వరకు ప్రవేశపెట్టిన పీ3 విధానం గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని, ఆ ఉద్దేశంతోనే పీ4 విధానాన్ని తీసుకొచ్చామన్నారు. పీ4 విధానం ప్రజల ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు గేమ్ ఛేంజర్ కానుందన్నారు.
ఏపీలో ప్రస్తుతం రూ. 2.68లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి రూ. 58.14లక్షలు అవుతుందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో సంపద సృష్టిస్తామని, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుతామన్నారు. దీని ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, తద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 4.03 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని వనరులు, ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రూ. 3.23లక్షల కోట్లు ఖర్చు పెట్టొచ్చన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రూ. 1,20,056 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఏపీ నుంచి అమెరికా వెళ్లిన వారు అమెరికా వాసుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని, ఆ వాతావరణాన్ని ఏపీలో కూడా కల్పిస్తే ఇక్కడి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. వృద్ధిరేటు పెంచుకోకపోతే అప్పు చేయాల్సి వస్తుందని, అప్పుడు అప్పుల ఊబిలోకి వెళ్తామన్నారు. ప్రస్తుతం ఆలిండియా గ్రోత్ రేట్ కంటే 3.24 శాతం అధనంగా గ్రోత్ రేట్ సాధించామన్నారు.