Changanti | లౌకిక దేశంలో చాగంటి ఏ తరహా నైతిక విలువల్ని బోధిస్తారు?
ఇప్పటికే విద్యాసంస్థల్లో మెజారిటీ, మైనారిటీ వాదాలు ఉండనే ఉన్నాయి."మాపై మీ మోరల్ పోలీసింగ్ ఏమిటని " ఇప్పటికే భిన్న వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
By : The Federal
Update: 2024-11-09 12:05 GMT
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యార్థులలో నీతి, నియమాలు, నైతిక విలువలు పెంపొందించేలా ఆయన కృషి చేస్తారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పదవి లేదు. 2016లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను సాంస్కృతిక సలహాదారుగా నియమించింది. అప్పట్లోనే ఈ పోస్టును సృష్టించడంపై వాదవివాదాలు జరిగాయి. ఈసారి చంద్రబాబు ఆయన్ను నైతిక విలువల సలహాదారుగా నియమించారు. ఇప్పుడు రాష్ట్రంలో దీనిపై చిటపటలు మొదలయ్యాయి. అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు వాదనలు చేస్తున్నారు.
చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపై మంచిపట్టుంది. ఆయన ప్రసంగాలకు మంచి గిరాకీ ఉంది. మంచి వక్త. పురాణాలలో ప్రతిభావంతుడు. వేదాలపై మంచి పట్టు కూడా ఉంది. ఆయన ప్రసంగాలకు విస్తృత వ్యాప్తి కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుగా కూడా నియమితులయ్యారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లోని 10 మంది అంబాసిడర్‌లలో ఆయన కూడా ఒకరు. ఉపన్యాసాల చక్రవర్తి, జ్ఞాన సరస్వతీ దేవి పుత్రుడు వంటి బిరుదులు ఆయన ఖాతాలో ఉన్నాయి.
2019లో చంద్రబాబు ప్రభుత్వం పోయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాగంటి కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీపీ) సలహాదారుగా నియమించినప్పటికీ ఆయన ఆ పదవిని తిరస్కరించడం ఊహించని పరిణామమే. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించడం పైనా ఆనాడు విమర్శలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి ఆనాడు చెప్పారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అన్నారు.
చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు చాగంటి సుందర శివరావు, చాగంటి సుశీలమ్మ దంపతులకు 1959 జూలై 14న జన్మించారు. అతని తండ్రి హిందూ ధర్మాన్ని అనుసరించేవారు. విద్యార్థి రోజుల నుంచే ఆయన ప్రాచీన భారతీయ జ్ఞానంపై పట్టుసాధించారు.
ఇప్పుడు ఆయన్ను నైతిక విలువల సలహాదారుగా నియమించారు. నైతికత అనేదాన్ని విస్తృతార్థంలో వాడతారు. అసలు ఏది నైతికత అనే దానిపై వివాదం ఉంది. నైతికతకు మూడు ప్రధాన అర్థాలు ఉన్నాయి.
నైతికత అనేది వ్యక్తిగతమైంది. పెరిగిన వాతావరణం, పాటించే సాంస్కృతిక విలువలు, ప్రవర్తనా నియమావళి, మానవ సమాజంలోని సామాజిక విధానాలను అంటే తప్పొప్పులను సూచిస్తుంది. నైతికతను గురించి సలహాలు ఇవ్వడానికి ఓ వ్యక్తిని నియమించడమే సరైంది కాదన్నది హేతువాదుల వాదన. ఏది సరైందీ, ఏది కాదు అనే దాని గురించి తీర్పులు ఇవ్వడం సరికాదన్నది హేతువాదుల అభిప్రాయం. సహజంగా జనాంతికంగా తప్పుగా భావించే వాటిని మాత్రమే ఈ నైతికత సూచిస్తుంది. అనేక నైతిక నమ్మకాలు పక్షపాతం, అజ్ఞానం లేదా ద్వేషం మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఆలోచనాపరులు సరైన ప్రవర్తనకు సరైన నిర్వచనం లేదు. నిర్దిష్ట విశ్వాస వ్యవస్థలు, సామాజిక-చారిత్రక సందర్భాల ప్రమాణాలలో నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించి మాత్రమే నైతికత అంచనా వేయబడుతుంది. ఇదో సాపేక్షవాదం అంటుంటారు.
భిన్నమతాలు, కులాలు ఉన్న భారతదేశంలాంటి ప్రజాస్వామిక దేశంలో హైందవ ధర్మాన్ని ప్రబోధించే ఓ వ్యక్తిని నైతిక విలువల సలహాదారుగా నియమించడం ఎట్లా చెల్లుబాటవుతుందని ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త డి.నరసింహారెడ్డి ప్రశ్నించారు. సార్వత్రిక, శాశ్వతమైన నైతిక సత్యాలు ఉంటాయా అనే వివాదం నడుస్తున్న దశలో ఇలాంటి నియామకాలు వివాదం కావడం సహజమే.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని కొందరితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి చెబుతున్నారు. హిందువులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించబోమంటున్నారు. సనాతన ధర్మాన్ని పాటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. సరిగ్గా ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియామకం చేశారు. చాగంటి కోటేశ్వరరావు ఏ తరహా నైతిక విలువల గురించి విద్యార్థులకు బోధిస్తారని హేతువాద సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
2012, 2016లో చాగంటి కోటేశ్వరరావు షిరిడీ సాయిబాబాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. షిర్డీ సాయిబాబా భక్తులు అప్పుడు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి. కేంద్రప్రభుత్వం జోక్యంతో ఆ కేసుల్ని ఉపసంహరించుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. శ్రీకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలకు అఖిల భారత యాదవ మహాసభ నుంచి నిరసనలను ఎదుర్కొన్నారు. కొందరు యాదవ ప్రజాప్రతినిధులు ఆయనతో చర్చలు జరపడం, యాదవుల పట్ల తనకేమీ అగౌరవం లేదని వివరణ ఇవ్వడం, ఏ సంఘాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేయడంతో ఆ నిరసనలు సమసిపోయాయి.
చాగంటి కోటేశ్వరరావు కాకినాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2018లో పదవీ విరమణ చేశారు. ఆయన భార్య సుబ్రహ్మణ్యేశ్వరి వ్యవసాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు. షణ్ముఖ చరణ్, నాగవల్లి . ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. చాగంటి కోటేశ్వరరావు భాగవతం, రామాయణం, మహాభారతం వంటి వివిధ హిందూ ఇతిహాసాలపై మతపరమైన ఉపన్యాసాలు క్రమం తప్పకుండా ఇస్తారు. ఎటువంటి పారితోషికాన్ని అంగీకరించ కుండా స్వచ్ఛందంగానే ప్రసంగాలు ఇస్తుంటారు. 42 రోజులలో రామాయణం, 42 రోజులలో భాగవతం, 30 రోజులలో శివపురాణం, 2-3 నెలల్లో శ్రీ లలితా సహస్ర నామాన్ని పూర్తి చేస్తారు. శంకరాభరణం (1980), శ్రుతిలయలు (1987)లలోనూ ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చూడవచ్చు. అవార్డులు, రివార్డులు కోకొల్లలు.
అటువంటి చాగంటి కోటేశ్వరరావు ఇప్పుడు రాష్ట్ర నైతిక విలువల సలహాదారు. ఈ హోదాలో ఆయన ఏమి చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. హైందవ ధర్మం ప్రకారం నైతిక విలువల్ని బోధిస్తారా లేక వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెబుతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ప్రతి స్కూల్లో మోరల్ సైన్స్ అనే పాఠ్యాంశం ఉంది. దాని కోసం ఓ క్లాస్ కూడా ఉంటుంది. ఓ మనిషి వ్యక్తిత్వం అనేది ఆ మనిషి జీవితంలో తీసుకునే నిర్ణయాల సమగ్ర సమ్మేళనం. మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సహజమైన, జన్యుపరమైన, పర్యావరణ కారణాలు ఉంటాయి. ఇదో సోషలైజేషన్ ప్రక్రియ. వ్యక్తిత్వం, విలువలు, నమ్మకాలు మన చుట్టూ ఉండే పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వాటిలో వంశపారంపర్య కారకాలు, నివసించే నిర్దిష్ట సామాజిక వాతావరణంతో సమ్మిళితమై ఉంటాయి. వీటిలో వేటిని ఎంచుకుని చాగంటి ప్రవచనాలు చేస్తారో మున్ముందు చూడాల్సి ఉంది.
ఇప్పటికే విద్యాసంస్థల్లో మెజారిటీ, మైనారిటీ వాదాలు ఉండనే ఉన్నాయి. ఏ ఒక్కరికి అనుకూలంగా చెప్పినా తగవులు తప్పడం లేదు. మత ఉద్రిక్తతలు కూడా ఏర్పడుతున్నాయి. "మాపై మీ మోరల్ పోలీసింగ్ ఏమిటని " ఇప్పటికే సమాజంలోని భిన్న వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.