ఏపీలో జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతేనా!

ఆంధ్రలో జాతీయ పార్టీలు అంతర్దానం అయ్యాయి. ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతున్నాయి. కానీ భవిష్యత్‌ మాత్రం రాష్ట్రీల పార్టీలదే.

Update: 2024-04-03 08:00 GMT
Source: Twitter

ఆంధ్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇందులో ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ అవి వాటి ఉనికి కాపాడుకునే పనిలో తలమునకలై ఉన్నాయి. గతంలో జాతీయ పార్టీలు ఆంధ్రలో తమ మార్క్ చూపించుకున్నా.. ప్రస్తుతం వాటి ఊసు కూడా ఎవరూ ఎత్తడం లేదు. ఏ ఉన్నాయ్ అంటే ఉన్నాయ్ అంతే అన్నట్లు ఉంది వాటి పరిస్థితి. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ.. ఆంధ్ర రాజకీయాలను ఏలుతున్నాయి. జాతీయ పార్టీలు ఇప్పుడు ఆంధ్రపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రలో మళ్లీ తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటే మరికొన్ని రాష్ట్ర పార్టీ బాధ్యతలను కీలక వ్యక్తుల చేతుల్లో పెట్టి వారి ద్వారా రాష్ట్రంలో సర్వైవ్ అవ్వాలని చూస్తున్నాయి.

ఉనికి కోసమే పొత్తులు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలమైన పార్టీగా ఎవరూ చూడరు. అది జాతీయ పార్టీనే అయినప్పటికీ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలి, 370 సీట్ల లక్ష్యాన్ని ఛేదించాలి అంటే బలంగా లేని దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం బీజేపీకి అనివార్యమైంది. అందులో భాగంగా ఆంధ్రలో పొత్తులు పెట్టుకుని తమ ఉనికిని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలో ఎవరు గెలిచినా తమకు లబ్ధి చేకూరేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు మార్చ్ 17న చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి దగ్గర జరిగిన ‘ప్రజాగళం’ సభలో వైసీపీని పల్లెత్తు మాట కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో అనకపోవడం నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. టీడీపీ గెలిస్తే కూటమి ద్వారా, వైసీపీ గెలిస్తే ఎప్పటిలానే తమకు మద్దతు లభిస్తుందని, కానీ కూటమి గెలవడం ద్వారా ఆంధ్రలో కొన్ని స్థానాల్లో అయినా బీజేపీ నేతలు అధికారంలో ఉంటారని భావించి కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకనే పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అన్ని రోజులు తీసుకుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రలో తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.

కాంగ్రెస్‌దీ అదే తంటా

కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీది కూడా ఆంధ్రలో బీజేపీ.. పరిస్థితే. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లక్ష్యంగా కాకుండా ఉనికి ముఖ్యంగా పోటీ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వతంత్య్రం తర్వాత రాష్ట్రంలో అప్రహితంగా అధికారాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్‌కు తొలిసారి తెలుగుదేశం పార్టీతో ఎన్‌టీఆర్‌ బ్రేకులు వేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల్లో తనకున్న పేరును కాపాడుకున్న కాంగ్రెస్ 2004లో మరోసారి అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాల్లో తన మార్క్‌ను చూపించింది. అయితే 2014లో ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ కుదేలయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తయింది. ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2019లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. దీంతో ఆంధ్రలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పదేళ్ల కాలంలో కనుమరుగయిపోయింది. దీంతో 2024 ఎన్నికలతో ఎలాగైనా తామూ ఉన్నామని చూపించుకోవాలని కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ షర్మిలను తమ పార్టీలోకి ఆహ్వానించింది. అంతేకాకుండా వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఢీకొట్టాలంటే సరైన నేతగా షర్మిలను ఎన్నుకున్న కాంగ్రెస్.. ఆమెకు రాష్ట్ర అధికారాన్ని కట్టబెట్టింది. తనకు ఇచ్చిన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్న షర్మిల.. అనతికాలంలోనే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ను గుర్తు చేశారు. అభ్యర్థులను ఖరారు చేయడం, ప్రసంగాలు, నిర్ణయాలు అన్ని విషయాల్లో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి షర్మిల పడుతున్న కష్టానికి రానున్న ఎన్నికల్లో ఫలితం లభిస్తుందో లేదో చూడాలి.

కంటికి కూడా కనిపించని జాతీయ పార్టీలు

ఇక సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ పార్టీల విషయానికి వస్తే ప్రస్తుతం వీటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆంధ్రలో ఇవి ఉన్నాయని కూడా ఎవరూ గుర్తించట్లేదు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా సీపీఎం-9, సీపీఐ-6, బీఎస్‌పీ-1 స్థానాలకు సొంతం చేసుకుని ఆంధ్రలో రాణిస్తున్నాయి. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ 2009లో జరిగిన ఎన్నికల్లోనే ఈ పార్టీలు కనిపించకుండా పోయాయి. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకున్న సీపీఎం, ఆరు స్థానాలు గెలుచుకున్న సీపీఐ కూడా 2009లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయాయి. అప్పుడు మొదలు ఇప్పటివరకు ఈ పార్టీలు మళ్ళీ ఆంధ్రలో గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాకుండా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికైనా ప్రయత్నిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు.

భవిష్యత్తు కూడా ప్రాంతీయ పార్టీలదే

అయితే జాతీయ పార్టీలు ఎంత తాపత్రయపడినా భవిష్యత్తులో కూడా ఆంధ్రలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని, ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగినా ఆంధ్రలో ఒక జాతీయ పార్టీ అధికారంలోకి రావడానికి కనీసం 30 సంవత్సరాలు పట్టొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే జాతీయ పార్టీలు తమ ఉనికి నిలబెట్టుకోవాలంటేనే మరోసారి ఎన్నికలు జరగాల్సి ఉంటుందని, అప్పటి వరకు రాష్ట్రంలో జాతీయ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈలోపు రాష్ట్రీయ పార్టీలు మరింత బలోపేతం అయితే వాటి హవాను అడ్డుకోవడం జాతీయ పార్టీలకు వల్ల కాదని అంటున్నారు. మరి తమ ఉనికి కోసం జాతీయ పార్టీలు ఇంకేం చేస్తాయో చూడాలి.



Tags:    

Similar News