అనుమతులు లేని చర్చీల లెక్క వెనుక మతలబు ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్ లో చర్చీలపై కత్తి వేలాడుతోందా? అనుమతులు లేని చర్చీల లెక్కలు ఎందుకు తేలుస్తున్నారు? అనుమతులు లేకుంటే చర్యలంటే మతలబు ఏమిటీ?;
By : The Federal
Update: 2025-03-06 06:10 GMT
మతం ప్రజల పాలిట మత్తుమందు లాంటిదని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర కూడా అదే నిరూపిస్తోంది. నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ క్రిస్టియన్లకు విపరీతంగా మద్దతు ఇచ్చినట్టు ఆరోపణలు రాగా టీడీపీ వచ్చిన తర్వాత బీజేపీ ప్రవచిస్తున్న సనాతన ధర్మం, గుళ్లు, గోపురాలు వంటివి బహుళ ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణమైన చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయంపై సమగ్ర విచారణ జరపమని, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. (memo no 2712164/cpr/&rd/DB/2024. dt. 10-02-2025)ఇప్పుడీ జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ రాజ్ అధికారులు సర్వేలింకులు, కాగితాల కవెలకట్టలు తీసుకుని బయల్దేరారు. కలకలం సృష్టిస్తున్న ఈ జీవోపై ఇప్పటికే ఖండన మండనలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు గాని రాష్ట్ర పాలకులు గాని వ్యవహారం ముదిరే వరకు వివరణ ఇవ్వరు గనుక వాళ్ల నుంచి ఇప్పటికిప్పుడు స్పందన ఆశించలేమని ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 'రాష్ట్రంలో 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీలలో ఉన్న క్రైస్తవ చర్చిలకు అనుమతులున్నవీ లేనివి సమగ్ర విచారణ జరిపి, అనుమతులు లేని ప్రార్థనా మందిరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది క్రైస్తవులపట్ల మత వివక్షతను పాటించడమే.
రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎంత చిన్న కుగ్రామమైనప్పటికీ దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాలు ఉండడం మామూలే. ఇదేదో ఏ ఒక్క మతానికో ముడిపడి లేదు. అన్ని మతాల వారూ తమ ప్రార్థనా మందిరాలను కట్టుకుంటుంటారు. సహజంగా పల్లెటూళ్లు గనుక చాలా వాటికి అనుమతులుండవు. వీటికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోరు. ఇప్పుడు అనుమతులు లేవు అనే సాకుతో చర్చిలపై మాత్రమే చర్యలు తీసుకోవాలనుకోవడం ఒక మతంపై కక్షసాధింపు అవుతుంది. ఇది ప్రజల మధ్య అనైక్యత విద్వేషాలను సృష్టిస్తుంది.
క్రైస్తవ చర్చిలపైన మాత్రమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోమని ఉత్తర్వులివ్వడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. ప్రత్యేకంగా ఒక మతాన్ని లక్ష్యం చేసుకొని ఇచ్చిన ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను' అని వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
దీనివెనుక బీజేపీ కుట్ర ఉండవచ్చునన్న అనుమానాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యక్తం చేశారు. చర్చిల జోలికి చేతులు కాల్చుకోవద్దని కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇలా అనేక ప్రజాసంఘాలు, పార్టీలు ఓ మతాన్ని టార్గెట్ చేసే పని పెట్టుకోవద్దని హెచ్చరించాయి.
అసలేమిటీ వివాదం...
రాష్ట్రంలో అనుమతులు ఉన్న చర్చీలు ఎన్నీ, లేనివి ఎన్నో తెలపాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన ప్రసన్నకుమార్ పెద్దిరెడ్డి ఆర్టీఐ కింద పిటీషన్ పెట్టారు. ఆమేరకు పంచాయితీ రాజ్ శాఖ అన్ని జిల్లాలకు ఉత్తర్వులు పంపుతూ జీవో జారీ చేసింది. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన అప్పుడప్పుడు పాలకొల్లు వస్తుంటారు. విహెచ్‌పి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. సినిమా రంగానికి చెందిన వారితో కూడా పరిచయాలున్నాయని సమాచారం.
చర్చిల స్థలాలను వివాదాస్పదం చేయడానికి ఆయన ప్రయత్నించడం ఇదే మొదటి సారి కాదు. పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ తరహా ప్రయత్నాలను ఆయన గతంలోనే చేసినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై కొంతకాలంగా చర్చ సాగుతోంది. గత అక్టోబర్‌లో కూడా సమాచార హక్కు చట్ల్టం కింద ఆయన ఇవే వివరాలను కోరినట్లు తెలిసింది. దానిపై అధికారులు పరిశీలన చేయడానికి ప్రయత్నించగా స్థానికంగా తీవ్రస్థాయిలో దుమారం రేగింది.
గత ఏడాది నవంబర్ 12న సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చర్చిల నిర్వాహకులు, పాస్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో ఆయన రాష్ట్రస్థాయిలో పంచాయతీ రాజ్‌శాఖను ఆశ్రయించారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్‌కు బిజెపితో సన్నిహిత సంబంధాలుండటం, కొంత కాలంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుండటంతో ఆయన పని సులవైందని భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పంచాయతీ రాజ్ శాఖ వివాదాస్పద ఆదేశాలు జారీ చేయడం వెనుక విహెచ్‌పి లింకులు, సినీ పరిచయాలు ఉపయోగపడి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంచాయితీ రాజ్ శాఖ ఇచ్చిన జీవో మేరకు ఇప్పుడు ఐదారు జిల్లాలలో అనుమతులు లేని చర్చిల వివరాలు సేకరించారు. మిగతా చోట్ల సమాచారాన్ని లాగుతున్నారు. అనుమతులు లేని చర్చీలకు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేయడమో లేక జనావాసాలుగా మార్చడమో చేయాలని వీహెచ్పీ కోరుతోంది. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లు కూడా ఈ డిమాండ్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిణామాల పట్ల క్రిస్టియన్లు ప్రత్యేకించి చర్చీల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కలిసివచ్చే పార్టీలు, ప్రజాసంఘాల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు కోర్టుకు వెళ్లే ప్రయత్నాలలో ఉన్నారు.