పౌల్ట్రీ రంగంలో ఏయే వస్తువుల రేట్లు తగ్గుతాయంటే..

జీఎస్టీ శ్లాబు మార్పుతో పౌల్ట్రీ రంగానికి జరిగే మేలు ఏమిటీ;

Update: 2025-09-07 04:56 GMT
జీఎస్టీ శ్లాబ్‌ల మార్పుతో పౌల్ట్రీ రంగానికి ఊరట లభిస్తుందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫీడ్ అడిటివ్స్‌ పన్ను 18% నుంచి 5%కి తగ్గితే రైతుల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. యాంత్రీకరణ ఖర్చులు కూడా తగ్గుతాయి. దీంతో చిన్న, మధ్య తరహా రైతులు ఫారాలు పెట్టుకునేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాల లాభాలు పాలసీ అమలుపై ఆధారపడి ఉంటాయి.

జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3–4 తేదీలలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల నిర్మాణాన్ని కుదించి, ఇప్పుడు ఎక్కువ వస్తువులు 5% లేదా 18% కేటగిరీల్లోకి మార్చింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయాల వల్ల కొన్ని అవసరమైన వస్తువులు 5% రేటులోకి వస్తాయి. విలాసవంతమైన కొన్ని వస్తువులు, కార్లు, సిగరెట్లు వంటివి మాత్రం 40% వద్ద ఉంటాయి. ఈ ఖరీదైన క్యాటగిరీకీ పౌల్ట్రీ రంగానికి సంబంధం తక్కువ.
పౌల్ట్రీ వ్యాల్యూ చైన్ – ఏం మారుతుంది?
ప్రస్తుత Tax స్ట్రక్చర్, కొత్త సంస్కరణలను పరిగణలోకి తీసుకుంటే కొన్ని ప్రధాన ఉత్పత్తులు ఇలా ఉంటాయి:
లైవ్ పౌల్ట్రీ, తాజా గుడ్లు, లూజ్ చికెన్ మాంసం — ఇవన్నీ 0% లోనే కొనసాగే అవకాశం ఉంది. అంటే వీటిపై ఏ తరహా పన్నూ ఉండదు.
ఫ్రోజన్ లేదా ప్యాకేజ్డ్ చికెన్, ఎగ్ ప్రొడక్ట్స్ — ఇవి ఎక్కువగా 5%లో కొనసాగుతాయి.
పౌల్ట్రీ ఫీడ్ — ఇప్పటికే ఇది మినహాయింపులో ఉంది (0%), ఇది అలాగే కొనసాగే అవకాశం ఉంది.
ఫీడ్ అడిటివ్స్ (మెథయొనిన్, లైసిన్, విటమిన్స్) — ఇవి 18% పన్నుతో ఉన్నాయి. 5%కి తగ్గితే రైతులకు నేరుగా ఉపశమనం లభిస్తుంది.
వెటర్నరీ వ్యాక్సిన్లు — లైఫ్ సేవింగ్ కేటగిరీగా 5% రేటులో కొనసాగుతాయి.
పౌల్ట్రీ మెషినరీ (ఇంక్యుబేటర్లు, బ్రూడర్లు, ఫీడ్ మిక్సర్లు) — ఇదే ప్రధాన “డెల్టా పాయింట్”. ప్రస్తుతం 12% లేదా 18% పన్నుతో ఉంది. 5%కి వస్తే రైతులు, ఎంట్రప్రెన్యూర్స్ పెద్ద ఎత్తున యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
పశువుల దాణా, వ్యవసాయ యాంత్రీకరణపై ఐదు శాతం స్లాబ్ కి తగ్గించటం వల్ల ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టబడులు పెట్టె అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు కూడా చెబుతున్నారు.
రైతులకు లాభమెంత?
ఫీడ్ ఖర్చు:
Poultry రంగంలో ఎక్కువ ఖర్చు అయ్యేది ఫీడ్ కే. మొత్తం వ్యయంలో ఇది 60–70% ఫీడ్‌కే వెళ్తుంది. అందులో అడిటివ్స్ ఖర్చు 3–5%. 18% నుంచి 5%కి జీఎస్టీ తగ్గితే, పెద్ద ఫారాల్లో ఓ ఏడాదికి (దీన్నే ఈ రంగంలో సైకిల్‌ అంటారు) లక్షల్లో ఆదా అవుతుంది. ఉదాహరణకు 10,000 కోళ్లున్న ఫారంలో ఒక్క సైకిల్ ఫీడ్ అడిటివ్స్‌పై సుమారు ₹52,000 వరకూ సేవింగ్ కావొచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతుల సంఘం నాయకుడు ఆకురాతి దొరయ్య అంచనా వేశారు..
యాంత్రీకరణ:
ట్రాక్టర్, ఇంక్యుబేటర్, ఫీడ్ మిక్సర్, కోల్డ్ రూమ్‌లపై ప్రస్తుతం ఉన్న పన్ను కొన్నింటిపై 12%, మరికొన్నింటిపై 18% ఉంది. ఇవి 5%కి తగ్గితే కొనుగోలు ధరలో నేరుగా 6–11%వరకు పన్ను తగ్గుతుంది. ఉదాహరణకు, 8 లక్షల విలువైన ట్రాక్టర్‌పై పన్ను 12% నుంచి 5%కి వస్తే రైతు సుమారు ₹56,000 ఆదా చేసుకుంటాడు.

ప్రాసెస్డ్ డైరీ ఉత్పత్తులు:
పన్నీర్, ఫ్లేవర్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ లాంటి ఉత్పత్తులపై 12% నుంచి 5%కి తగ్గితే వినియోగదారులకు ఒక్క ప్యాక్‌కు కొన్ని రూపాయల తగ్గుదల కనిపిస్తుంది.
పశుసంవర్ధక శాఖ అభిప్రాయమేమిటంటే..
పశువంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అభిప్రాయం ప్రకారం- పాలు, దాణా, యాంత్రీకరణపై జీఎస్టీ 0–5% రేంజ్‌లో ఉంటే ఈ రంగాలలోకి కొత్త పారిశ్రామికవేత్తలు వస్తారు. ఇందులో కొంతవరకు నిజం లేకపోలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు పి.జమలయ్య చెప్పారు.
దీనివల్ల రైతుల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని, లాభం కాకున్నా నష్టాల మోత తగ్గుతుందని, ఇది ఆయా రంగాలలో రాణించాలనుకునే వారికి మేలు చేస్తుందని జమలయ్య అన్నారు.
అయితే పన్ను తగ్గింపు ఒక్కటే పెట్టుబడులు పెరగడానికి కారణం కాదని కూడా దొరయ్య అభిప్రాయపడ్డారు. మార్కెట్ ధరలు, ఎగుమతుల అవకాశాలు, రుణాల సౌలభ్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా కీలకమని అన్నారు దొరయ్య.
HSN కోడ్‌లు, GST రేట్లు ఇలా..
పౌల్ట్రీ రంగంలో ప్రధానంగా ఫీడ్ (ఆహారం), ఫీడ్ అడిటివ్స్ (సప్లిమెంట్స్), ఇతర సంబంధిత ఉత్పత్తులపై వేర్వేరు HSN కోడ్‌లు, GST రేట్లు ఉంటాయి. ఈ కోడ్ ఆధారంగా ఇవి ఏ క్యాటగిరీ జీఎస్టీ శ్లాబులో ఉంటాయో కనుక్కోవచ్చు.
1. పౌల్ట్రీ ఫీడ్ (Poultry Feed), HSN కోడ్: 2309. “Preparations of a kind used in animal feeding” – అంటే కోళ్లు, ఆవులు, మేకలు మొదలైన పశువులకు ఇచ్చే రెడీమేడ్ ఫీడ్. వీటిపై GST రేట్ అంటే పన్ను ఉండదు.
2. స్పష్టంగా చెప్పాలంటే పౌల్ట్రీ ఫీడ్‌పై GST లేదు.
3. ఫీడ్ అడిటివ్స్ (Feed Additives)- ఫీడ్‌లో కలిపే విటమిన్లు, ఖనిజాలు, ప్రీమిక్స్‌లు వంటివి. వీటి కోడ్ HSN 2309, 2390.
HSN-2936- ఇవి Provitamins & Vitamins
HSN-2836- ఇవి Calcium carbonate వంటి ఖనిజ పదార్థాలు.
Vitamins, Minerals వంటివి independent pharma/nutritional products అయినందున వీటిపై 5 శాతం జీఎస్టీ విధిస్తారని తెలుస్తోంది. ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఇవి 12% లేదా 18% GST క్యాటగిరీలో ఉన్నాయి.
మిక్స్-అప్ (ఫీడ్ vs ఫీడ్ అడిటివ్స్)
ఒక వస్తువును పౌల్ట్రీ ఫీడ్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని స్పష్టంగా ఉంటే GST పన్ను ఉండదు.
అదే వస్తువు ఫీడ్ గా కాకుండా మానవ వినియోగం/మెడికల్/జనరల్ కెమికల్ రూపంలో అమ్మితే 12% GST వర్తిస్తుంది.
ఇన్‌వాయిస్‌లో పౌల్ట్రీ రంగానికి HSN కోడ్ & వివరణ సరిచూసుకోవాలి – ఫీడ్, ఫీడ్ అడిటివ్స్ మిక్సప్ అయితే రేట్ తప్పిపోతుంది.
పౌల్ట్రీ రంగంపై పన్నుల వివరాలు..
లైవ్ పౌల్ట్రీ, గుడ్లు, తాజా మాంసం – పన్ను లేదు
ఫీడ్ అడిటివ్స్ 18% నుంచి 5% – ప్రతి ఫారానికి ఎంతో కొంత మేలు.
యాంత్రీకరణ పరికరాలు 12%/18% నుంచి 5% – మూలధనం ఖర్చు తగ్గి, బ్రేక్ ఈవెన్ పీరియడ్ మెరుగవతుంది.
ప్రాసెస్డ్ డైరీ – వినియోగదారుకు నేరుగా కొంత లాభం.
జీఎస్టీ సంస్కరణలు పౌల్ట్రీ రంగానికి ఊతం ఇచ్చేలా కనిపిస్తున్నా దీని వివరాలు సెప్టెంబర్ 22 తర్వాత గాని తెలియవు.
Tags:    

Similar News