ఎవరీ బోరుగడ్డ అనిల్ కుమార్.. ఏడాది కిందటి వరకు కూడా ఈ పేరు బహుఫేమస్. 'జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ ను చంపుతానని' చాటుమాటుగా కాకుండా పబ్లిక్ గా చెప్పిన వాడు. అలా నాలుగేళ్ల పాటు హల్ చల్ చేసిన ఈ అనిల్ కుమార్ ఇప్పుడు ఓ బెదిరింపు కేసులో అరెస్టై కటకటాలపాలయ్యాడు. ఆయనపై రౌడీషీట్ ఉన్నా ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి అనిల్. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన్ని చూస్తే చాలు జనం హడలెత్తేవారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. 2021నాటి పాతకేసును బయటకు తీసి ఇప్పుడు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్లపూడి బాబూ ప్రకాశ్ అనే ఆయన్ను అనిల్ బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారనే ఫిర్యాదు మేరకు అనిల్ అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు సమీపంలోని నల్లపాడు పోలీసు స్టేషన్ లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన నాయకులు నిందితుడు బోరుగడ్డ అనిల్ ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడం గమనార్హం.
ఎవరీ అనిల్, ఏమా కథ?
బోరుగడ్డ అనిల్ సొంతూరు గుంటూరు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన రాందాస్ అథవాలే అనుచరుడిగా చెప్పుకునే వారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా కొంతకాలం ఉన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనిల్ తనకున్న పరిచయాలతో జగన్ కు దగ్గరయ్యారు. జగన్‌ను అన్నా అని పిలిచే వారిలో ఇతనొకరు. తనదీ పులివెందులే నని చెప్పేవారు. జగన్ ను పేద ప్రజల పక్షపాతిగా భావించేవారు. జగన్ ను ఎవరైనా విమర్శిస్తే వాళ్లపై విరుచుకుపడేవారు. సోషల్ మీడియాలో పోస్టులైతే మరింత దారుణంగా ఉండేవని, తిట్లు, శాపనార్థాలకు లెక్కే ఉండేది కాదని అక్టోబర్ 16న నల్లపాడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేసిన టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. టీవీ డిబేట్‌లలో ఆయన తిట్టే తిట్లు చూస్తుంటే అసెంబ్లీలో ఓ సందర్భంలో బోండా ఉమామహేశ్వరరావు, కొడాలి నానీకి మధ్య జరిగిన తిట్ల పురాణం గుర్తుకువచ్చేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు, చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసేవాడు.
చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ ను ఉద్దేశించి చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళలు కూడా ఆయన విమర్శల నుంచి తప్పించుకోలేక పోయారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలు చేశారనే ఫిర్యాదులూ ఉన్నాయి.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌తో విభేదించి విమర్శలు చేసినప్పుడు ఆయన్ను ఈ అనిల్ బెదిరించారు. నెల్లూరు వచ్చి బండికి కట్టేసి లాక్కెళ్లిపోతానని ఫోన్‌లో బెదిరించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అప్పడు కోటంరెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలూ వచ్చాయి.
బోరుగడ్డ అనిల్ కి గుంటూరులోని రెండు ప్రాంతాలలో ఇళ్లు ఉండేవన, ఒకటి బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో, మరొకటి వేళాంగణినగర్‌లో ఉండేదని, ఈ రెండు ప్రాంతాల్లోనూ స్థానికులు ఆయన పై ఆగ్రహంతో ఉన్నారని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. ఒకప్పుడు ఆయనకు రక్షణగా నిలిచిన పోలీసులే ఇప్పుడు ఆయన పాలిట శత్రువులు అయ్యారని సమాచారం.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తన అనుచరులకు సకాలంలో వైద్యం అందించలేదని అప్పట్లో ఆయన డాక్టర్లపైనా వీరంగం వేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బెదిరింపులకు భయపడి గతంలో జూనియర్ డాక్టర్లు ఓ సందర్భంలో రెండు రోజులు సమ్మె కూడా చేశారు.
బోరుగడ్డ అనిల్‌పై గుంటూరుతో పాటు అనంతపురంలో కూడా కేసు నమోదయింది. అమ్మాయిలను వేధించిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు హత్యాయత్నం కేసుల్లో నిందితునిగా ఉన్నారు. న్యూసెన్స్ కేసుల్లోనూ ఉన్నారు. గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగిన సమయంలో జాతీయ మహిళా కమిషన్ గుంటూరుకు వస్తే బోరుగడ్డ అనిల్- ఇతరులెవరూ వినతిపత్రాలు ఇవ్వకుండా- అడ్డుకున్నారని ఆరోపణ. జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను చంపుతానని అనిల్ గతంలో బహిరంగంగా ప్రకటించాడు.
బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అనిల్ ని నల్లపాడు పోలీసు స్టేషన్ లో ఉంచిన విషయం తెలుసుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు బోరుగడ్డ వెంకటరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, కార్పోరేటర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ లాంటి అనేక మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యుల్ని అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తికి రాచమర్యాదలు చేస్తారా? అంటూ పోలీసులను నిలదీయడం కొసమెరుపు కాగా తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనకేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ అనిల్ భార్య మౌనిక ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.