తిరుమల- శ్రీవిల్లిపుత్తూరు ఆలయాల మధ్య అనుబంధం ఇదీ..

గరుడోత్సవంలో తిరుమల శ్రీవారి మెడలో గోదాదేవి మాలలు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-25 13:29 GMT

తిరుమల శ్రీవారి ఆలయానికి తమిళనాడులోని శ్రీవైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక బంధం చాలా బలమైనది. ప్రత్యేక సందర్భాల్లో ఈ ఆలయాల అధికారుల ద్వారా పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకొనే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి ఈ నెల 27వ తేదీ చిలకల పూలమాలలు తీసుకుని వచ్చి సమర్పించనున్నారు. ఈ చరిత్రను పరిశీలిస్తే..

తిరుమలలో పెదజీయంగార్ మఠం వద్ద గోదాదేవి మాలలతో అర్చకులు (ఫైల్

శ్రీవైష్ణవ ఆలయాలకు రాజధాని వంటిది శ్రీరంగంలోని రంగనాథుడి క్షేత్రం. ఈ ఆలయానికి తిరుమలతో విడదీయలేని అవినాభావ సంబంధం ఉందనేది చారిత్రక నేపథ్యం. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాల్లో గరుడోత్సవం రోజు శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారు ధరించిన పుష్పమాలలను సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.

శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారి ఆలయం నుంచి శ్రీరంగంలోని రంగనాథుడు ఆలయానికి చేర్చడం ద్వారా అక్కడి నుంచి తిరుమలకు తీసుకువచ్చి సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేదీ గరుడోత్సవం రోజు శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అధికారులకు శ్రీరంగం ఆలయ అధికారులు, అర్చకులు ఆ పూలమాలలు సమర్పిచడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అదే రోజు ఇప్పటికే చెన్నై నగరం ప్యారీస్ వద్ద ఉన్నపెరుమాళ్ ఆలయం నుంచి తీసుకుని వస్తున్న 11 గొడుగుల్లో తొమ్మిది శ్రీవారి ఆలయం ముందు చెన్నై హిందూ ధర్మార్థ సమితి సభ్యులు సమర్పించనున్నారు.
"రెండు గొడుగులు తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సమర్పిస్తాం" అని ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్. గోపాల జీ చెప్పారు.
ఆధ్మాత్మిక ప్రపంచంలో వైష్ణవ ఆలయాల వెనుక చారిత్రక నేపథ్యంపై తిరుపతిలోని సీనియర్ జర్నలిస్టు పివి. రవికుమార్ ఏమంటారంటే,
"శ్రీకృష్ణదేవరాయలు వారు రచించిన ఆముక్తమాల్యద గ్రంథంలో ఈ విషయాలు ప్రస్తావించారు" అని రవికుమార్ గుర్తు చేశారు. ఏపీలో టీటీడీ, తమిళనాడులో శ్రీరంగం ఆలయాలకు ఉన్న చారిత్రక నేపథ్యంపై ఆయన ఏమంటారంటే..
"తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి, తిరుచానూరు వద్ద ఉన్న శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం ఎలాంటిదో.. తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్, శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం అలాంటిదే" తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు రవికుమార్ చెప్పారు.
తిరుమలకు తమిళనాడులోని ఆలయాల నుంచి కానుకలు అందించడం ఓ ఆచారంగా సాగుతోంది. అక్కడి ఆలయాల్లో ఉత్సవాలకు టీటీడీ అధికారులు కూడా కానుకలు, పట్టువస్త్రాలు తీసుకుని వెళ్లి, సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక అనుబంధం పరంపరంను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో..
గోదాదేవి మాలల వెనక కథ ఇదీ..

శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారు ధరించిన పుష్పమాలలు శ్రీరంగంలోని రంగనాథస్వామికి సమర్పిస్తుంటారు. శ్రీరంగనాథుడికి భక్తురాలు అనేది ఓ కథనం. ఇష్టమైన సఖిగా మరో చారిత్రక కథనం ఉంది.
ఆమె ధరించిన పుష్పమాలలను తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనంపై ఊరేగే రోజు సాయంత్రం తిరుమలలో ఆలయం ముందు తమిళనాడు దేవాదాయ శాఖ, శ్రీవిల్లి పుత్తూరు ఆలయ అర్చకులు, అధికారురు సమర్పిస్తారు. ఆ పూలమాలలు తిరుమలలోని బేడిఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉన్న శ్రీపెద్దజీయర్ మఠం వద్ద అప్పగిస్తారు. అనంతరం కొత్త వెదురుబుట్టలో తీసుకుని వచ్చే పూలదండలు శ్రీవారి ఆలయం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వచ్చి, మహద్వారం వద్ద అప్పగించడం ద్వారా శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ అమ్మవారి కానుక సమర్పిస్తారు.
ఈ సంప్రదాయం వెనుక నేపథ్యం..
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ ఆధ్మాత్మిక పట్టనం శ్రీవిల్లిపుత్తూరు. ఇక్కడ కొలువైన దేవత ఆండాళ్ లేదా గోదాదేవి. చారిత్రక నేపథ్యంతో కూడిన కథనంలోకి వెళితే..

"గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగిందిజ, ఒక రోజు ఈ రహస్యం ఆమె తండ్రి విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా బాధపడి, గోదాదేవిని కూడా మందలించారట. ఆమె ధరించకుండా పంపించిన పూలమాల రంగనాథుడు అలంకరణకు తీసుకోలేదట. దీనికి తన కుమార్తె గోదాదేవి తప్పిదమే కారణమని బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదు. రోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు" ఆ మేరకు గోదాదేవి ధరించిన తరువాత రోజూ రంగనాథుడికి అలంకరించే వారనేది కథనం.

ఆ ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఆధారంగా ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం పువ్వులను చిలుకలుగా మార్చి, అల్లిన గోదాదేవి మాలలు తీసుకుని వచ్చి సమర్పించడం ఆనవాయిగా పాటిస్తున్నారు.

తిరుమల క్షేత్రంలో జనవరిలో నిర్వహించే గోదాదేవి పరిణయోత్సవాల సందర్భంగా కూడా శ్రీవిల్లి పుత్తూరు నుంచి తీసుకుని వచ్చే పూలమాలలు శ్రీవారికి అలంకరించడం ఆనవాయితీ.
తిరుమలలో ఆణివార ఆష్థానం రోజు శ్రీరంగంలోని పాండురంగనాథుడి ఆలయం నుంచి తమిళనాడు దేవాదాయ శాఖ, శ్రీరంగం ఆలయ అధికారులు పట్టువస్త్రాలు తీసుకుని వచ్చి సమర్పించడం ఆనవాయితీ. అదేవిధంగా తమిళ కార్తీక ఏకాదశి రోజు టీటీడీ అధికారులు శ్రీరంగనాథుడికి పట్టువస్త్రాలు అందజేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ వైష్టవాలయాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఎంతబలంగా ఉందనే విషయాలు వివరిస్తాయి.
చెన్నై నగరం ప్యారీస్ వద్ద ఉన్నపెరుమాళ్ ఆలయం నుంచి తీసుకుని వస్తున్న 11 గొడుగుల్లో తొమ్మిది శ్రీవారి ఆలయం ముందు చెన్నై హిందూ ధర్మార్థ సమితి సభ్యులు సమర్పించనున్నారు.

"రెండు గొడుగులు తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సమర్పిస్తాం" అని ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్. గోపాల్ జీ చెప్పారు.
Tags:    

Similar News