ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్న భూమన
సర్కార్ కే సవాల్ గా మారిన సతీష్ మృతి, మలుపులు తిరుగుతున్న పరకామణి చోరీ వ్యవహారం
By : The Federal
Update: 2025-11-15 10:06 GMT
తిరుమల పరకామణిలో చోరీపై ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీష్ కుమార్ మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మృతిని సర్కార్ హత్యగా టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా సతీష్ మృతిపై పోలీసు అధికారుల బృందం పరిశోధనకు దిగింది. సతీష్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరకామణి కేసులో తనకు ప్రాణహానీ ఉందని సతీష్ గతంలో చెప్పారని రైల్వే పోలీసులు ఇప్పుడు చెబుతున్న కథనం కలకలం రేపింది.
సతీష్ తమ్ముడి ఫిర్యాదు..
తిరుపతి పరకామణి చోరీ కేసు (Tirupati Parakamani Theft Case)లో కీలక వ్యక్తి ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ (RI Satish Kumar) నిన్న మరణించారు. ఆయన తమ్ముడు శ్రీహరి తిరుపతి రైల్వే పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు చేశారు. సతీష్ కుమార్‌ది హత్యేనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుని గుంతకల్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ కుమార్ ప్రయాణం - మరణం మధ్య అసలు ఏమి జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు. శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుపై భారతీయ శిక్షా స్మృతి 103 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కారా?
తిరుపతి వచ్చేందుకు సతీష్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్టు సీసీ ఫుటేజీలో గుర్తించారు. గుంతకల్లు నుంచి తిరుపతి వరకు A1 భోగి బెర్త్ నెంబర్ - 29ని ఆయన బుక్ చేసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ పట్టాల పక్కన సతీష్ కుమార్ పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు.
భూమన ఏమన్నారంటే...
తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను వాడుకుంటుందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ప్రభుత్వ హత్యే..!
"పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు" అని భూమన ఆరోపించారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం...
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు.
గురువారం రాత్రి 11.55 గంటలకు సతీష్‌కుమార్ రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో బైక్‌ను పార్క్ చేశాడు. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్‌ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్క్ చేసిన అతడు గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.
పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కొందరు అధికారులు జోక్యం చేసుకుని రవికుమార్ కి సతీశ్ కుమార్ కి మధ్య రాజీ కుదిర్చారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.