రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పుట్టపర్తి పట్టణంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఆమె మామ, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖులు హాజరు కానున్న సందర్భంగా సత్యసాయి విమానాశ్రయం, లాంజ్, హిల్ వ్యూ స్టేడియం, సాయి కుల్వంత్ హాలు తదితర ప్రదేశాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులతో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ నిత్యం సమీక్షిస్తున్నారు.
"ప్రముఖుల భద్రత, సదుపాయాల తోపాటు దేశ,విదేశాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా పని విభజన చేశాం" అని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ చెప్పారు.
పుట్టపర్తి మీదుగా.. 350 రైళ్లు..
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లు పుట్టపర్తి మీదుగా ప్రత్యేకంగా నడపడానికి చార్ట్ సిద్ధం చేశారు.
పుట్టపర్తి మీదుగా ప్రస్తుతం 175 రైళ్లు రోజుకు నడుస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా మరో 170 రైళ్లు పుట్టపర్తి మార్గం మీదుగా నడపడానికి డైవర్ట్ చేశారు. ఆ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కూడా అన్ని డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉచిత ప్రయాణం
పుట్టపర్తి, ఈ కేంద్రానికి సమీపంలోనే ఉన్న ధర్మవరం రైల్వే స్టేషన్లలో దిగే సాయి భక్తులను ప్రశాంతి నిలయానికి చేర్చడానికి వీలుగా ఏపీఎస్ఆర్టీసీ 200 బస్సులను సిద్ధంగా ఉంచడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని రాయలసీమలోని అనంతపురం, కడప, అన్నమయ్య, పుట్టపర్తి విభజిత జిల్లా ఆర్టీసీ అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు.
"పుట్టపర్తి లోని 23 మార్గాల్లో 150 బస్సులు నడిపే విధంగా కార్యచరణ సిద్ధం చేశాం. పది సుదూర ప్రాంతాలు ప్రయాణించే సర్వీసులతోపాటు శ్రీసత్య సాయి ప్రశాంతి నిలయం నుంచి 20 షటిల్ బస్సులు నడపడానికి మార్గం నిర్దేశించాం. మరో 10 బస్సులు ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం కు నడపాలి" అని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీనికోసం
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులు, అనంతపురం జిల్లా నుంచి 50, కడప జిల్లా నుంచి 20, అన్నమయ్య జిల్లా నుంచి 30 బస్సులు పుట్టపర్తిలో నడపడానికి ఏర్పాటు చేశారు.
ఉచిత షటిల్ సర్వీసులు..
పుట్టపర్తికి లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఇబ్బంది లేకుండా పుట్టపర్తి రైల్వే స్టేషన్, ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు, మళ్లీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కు చేర్చడానికి వీలుగా 30 షటిల్ సర్వీసులు నడపాలి అని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. పది రోజుల పాటు విధులు నిర్వహించడం ద్వారా యాత్రికుల సేవ కోసం ఐదు మంది డిపో మేనేజర్లు, పదిమంది సూపర్వైజర్లు 15 మంది కంట్రోలర్లు, మరో 20 మంది సహాయకులు అందుబాటులో ఉంచే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి.
"పుట్టపర్తికి మొదట 150 బస్సులు నడపాలని భావించాం. అవి సరిపోవనే ఈ సంఖ్య 200కు పెంచాం" అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు తిరిగి ప్రయాణికులను అదే ప్రాంతంలో వదిలే విధంగా బాధ్యతలు వికేంద్రీకరించారు.
పుట్టపర్తిలో బస్సులు నడపడంలో తాత్కాలికంగా మూడు బస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
1. పుట్టపర్తి విమానాశ్రయానికి సమీపంలోని ఎనములపల్లి
2. ప్రశాంతి నిలయానికి పడమటి పక్క (West side)
3. ప్రశాంతి నిలయానికి తూర్పు వైపు (East of Prasaanti nilayam )
పుట్టపర్తి లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక బస్ స్టేషన్ లో అవసరమైన సివిల్, ఎలక్ట్రి క్ పనులను సత్య సాయి ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
ఉత్సవాల ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారధ్యంలో నియమించిన సబ్ కమిటీ బుధవారం పుట్టపర్తిలో సమావేశం కానున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మంత్రి ఎస్. సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డితో పాటు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు.