ఓ దేవా ఈ నది చాలా గొప్పది, నా పొట్ట చాలా చిన్నది! జాలర్ల కన్నీటి పాట
వలే సర్వస్వం, చేపలే సత్యం- కృష్ణా తీరంలో మత్స్యకారుల బతుకుపాట
By : Pedapolu Ravi
Update: 2025-11-08 10:22 GMT
"ఓ దేవా, నీ సముద్రం చాలా గొప్పది, నా పడవ చాలా చిన్నది" అని కవి వాపోయినట్టు మత్స్యకారుల బతుకు ఎక్కడైనా ఒక్కటే.
వలే సర్వస్వం. చేపలు పట్టడం ఒక్కటే సత్యం.
అది మరపడవైనా, నాటుపడవైనా.. వల లేనిదే చేప చిక్కదు. పూట గడవదు.
విజయవాడకు వరం కృష్ణా తీరం. పొడవెక్కువ. తీరంలో జాలర్లకు కనీస సదుపాయాలు లేవని బాధపడాలో, ఏదో విధంగా నాలుగు చేపలు చిక్కి బతుకుతున్నందుకు సంతోషపడాలో అర్థం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ నుంచి వెళ్లాలంటే కృష్ణానది కరకట్ట మీదుగా పోవాల్సిందే.
ప్రకాశం బ్యారేజీ మొదలు మంతెన ప్రకృతి చికిత్సాలయం వరకు కృష్ణానది వెంబడి వందలాది మంది మత్స్యకారులు భుజాన వలలేసుకుని చేపల మడుగుల కోసం వెతుక్కుంటుంటారు.
గాలాలతో పట్టే వాళ్లు కొందరైతే వలలతో పట్టే వాళ్లు ఇంకొందరు.
ఈ జాలర్లది నిత్యం బతుకుపోరాటమే.
నాలుగు చేపలు చిక్కితే భుక్తి, దొరక్కపోతే ఆకలి వేదన.
వానొచ్చినా వరదొచ్చినా ఈ వేట ఆగదు. ఆగితే బతుకు సాగదు.
ప్రతీ ఉదయం కృష్ణానది మీద వేటకు వెళ్లే జాలర్ల ప్రార్థన ఎలా ఉంటుందంటే... ఈరోజైనా రెండు చేపలు చిక్కాలి, నాలుగేళ్లు నోట్లోకి వెళ్లాలి.
మళ్లీ సమరానికి సన్నద్ధం...
కృష్ణా తీరంలో ప్రతి అల, ప్రతి వల వినిపించే పాట “ఓ దేవా, నీ నది చాలా గొప్పది, నా పొట్ట చాలా చిన్నది”. అదే జాలర్ల భక్తిగీతం,
అదే జీవన గీతం.
ఈ జాలర్ల బతుకుపోరాటాన్ని ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్రాఫర్ రవి తన కెమెరాలో బంధించారు.