కొంగు బిగించి కలుపు తీసిన కలెక్టరమ్మ!

ఆంధ్రా కలెక్టర్ల రూటే సెపరేటు.. ఒకరు సైకిల్, ఇంకొకరు బడి పంతులు, మరొకరు వ్యవసాయ కూలీ..

Update: 2025-11-06 11:49 GMT
Kritika Shukla
మొన్న ఓక కలెక్టర్ గారు సైకిల్ ఎక్కి కార్యాలయానికి వచ్చారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసమన్నారు..
నిన్నో కలెక్టర్ బడికెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పారు.. టీచర్ల వృత్తి ప్రమాణాలు పెంచడానికన్నారు
ఇవాళ ఓ కలెక్టరమ్మ ఏకంగా పొలంలోకి దిగి కలుపు తీశారు.. పండ్ల తోటల పెంచమని హితవు చెప్పడానికన్నారు.
ఇలా ఆంధ్రప్రదేశ్ లోని కలెక్టర్లు తమ ఆసక్తులను బట్టి సామాన్య జనంతో కలిసి పని చేస్తూ తాము సామాన్యులమేనని నిరూపిస్తూ వస్తున్నారు.
ఇప్పడు పొలంలో కలుపు తీసిన కలెక్టర్ కృతిగా శుక్లా. ఐఎఎస్. పల్నాడు జిల్లా కలెక్టర్. ఆమె నిన్న క్షేత్రస్థాయి పర్యటనకు రాజుపాలెం మండలం వెళ్లారు.
ఆకులగణపవరం, రాజుపాలెం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. దారిపొడవునా పొలాల్లో పని చేస్తున్న మహిళలతో మాట్లాడారు. ఆకులగణపవరం గ్రామ సమీపంలో మిరపచేలో కలుపు తీస్తున్న మహిళల వద్దకు వెళ్లి వాళ్ల యోగక్షేమాలు కనుక్కున్నారు. మహిళా కూలీలతో కలిసి మిరప చేలో కలుపు తీశారు. కాసేపు వాళ్లతో ముచ్చటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ తమతో కలిసి కలుపు తీయడం భలే సంతోషమనిపించిందని మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇట్లా వచ్చి తమతో మాట్లాడుతుందనుకోలేదని ఆమెకి కలుపు తీయడంలో లిక్కి (చిన్న కొడవలి) అందించిన మహిళ సంబరపడ్డారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్‌ అమలకుమారి కూడా ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న జ్యోతి, నాగేశ్వరరావు దంపతులను అభినందించారు. ఐసీఆర్పీల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు.
ఆ తర్వాత వాల్యూ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సర్వీసెస్‌ సంస్థ, ఉద్యాన శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వరి, పత్తి వంటి పంటలతో పోల్చితే, ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు నాగేశ్వరరావు పొలంలో మొక్క నాటి రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ సాగుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉందన్నారు. రాజుపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.
ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతిగా శుక్లా పని తీరును మెచ్చుకున్నారు.

ఎవరీ కృతికా శుక్లా..

హర్యానాలో పుట్టి ఆంధ్రప్రదేశ్ లో మట్టివాసన చూసిన ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా. పదవిలో ఉన్నా, మానవత్వాన్ని కోల్పోని, ప్రజల మధ్యే తన స్థానం వెతుక్కున్న ఒక అధికారి. 36 ఏళ్లు. పల్నాడు జిల్లాలో పొలాల్లో కలుపు తీసిన కలెక్టర్‌గా, మహిళా కూలీలతో చేలో మట్టిలోకి దిగిన పరిపాలకురాలిగా, కృతికా శుక్లా పేరు ఇప్పుడు ప్రజల్లోకి చేరింది.

1989 జనవరి 14న హర్యానాలో జన్మించిన కృతికా శుక్లా విద్యను తన జీవితాధారంగా చేసుకున్నారు. తండ్రి మదన్‌లాల్ బాత్రా స్టాక్‌ బ్రోకింగ్ వ్యాపారవేత్త, తల్లి హర్షా బాత్రా ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్. విద్యా ప్రేరణ ఆ ఇంట్లోనే మొదలైంది. ఆమె శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుండి బి.కాం (హానర్స్), హన్స్రాజ్ కాలేజ్ నుండి ఎం.కాం పూర్తి చేశారు. తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తత్త్వశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. అకడమిక్ ప్రతిభతో పాటు, సామాజిక దృష్టి, సున్నితమైన ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మద్దతుగా నిలిచాయి.

UPSCలో 103వ ర్యాంక్ – 24 ఏళ్లకే ఐఏఎస్‌

2012లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 24 ఏళ్ల వయసులోనే ఉత్తీర్ణురాలై దేశంలోని అత్యుత్తమ సేవల్లోకి అడుగుపెట్టారు.

మొదట జమ్మూ–కశ్మీర్‌ క్యాడర్‌ కేటాయించారు. తరువాత సహాధికారి **హిమాన్షు శుక్లా (IAS)**ను వివాహం చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. తాను UPSC మార్కుల ప్రకారం 1017 మార్కులతో 103వ ర్యాంక్ సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కృతికా శుక్లా పలు కీలక పదవుల్లో పనిచేశారు. విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, మదనపల్లెలో సబ్ కలెక్టర్‌గా, గుంటూరులో జాయింట్ కలెక్టర్‌గా. తర్వాత మహిళా, బాల సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌, వికలాంగుల సంక్షేమ శాఖల్లో సీనియర్ హోదాల్లో సేవలందించారు.

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె “ప్రజా హిత పరిపాలన”కు నిదర్శనంగా నిలిచారు.

తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారు

Tags:    

Similar News