డ్రైవర్లిక ఇష్టమొచ్చినట్టు తోల్తామంటే కుదరదు!

డ్రైవర్లు ఇకపై ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడుపుతామంటే కుదరదని తేల్చి చెప్పిన ఆర్టీఏ

Update: 2025-11-10 09:15 GMT
కర్నూలు సమీపంలో జరిగిన భయానక బస్ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన తర్వాత ఏపీ ప్రభుత్వం మేల్కొంది. ఇకపై డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టుగా వాహనాలు నడపడం కుదరదని స్పష్టం చేసింది. రవాణా శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఈ రోడ్డు ప్రమాదాలపై వ్యక్తం చేసిన ఆగ్రహం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కదిలినట్టు కనిపిస్తోంది. జాతీయ రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్లపైనే ప్రాణాలు బలవుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖలు సంయుక్త చర్యలకు సిద్ధమయ్యాయి.
డ్రైవర్లు ఇకపై ఇష్టమొచ్చినట్టు వాహనాలను నడుపుతామంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కఠినంగానే వ్యవహరించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో డ్రైవర్ల లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ, నిఘా ఉంచేలా చూడనుంది. దీంతో వాహనాలను ప్రత్యేకించి పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టు బస్సులు, లారీలు నడిపే వారిపై నిఘా పెరగనుంది.

రోడ్ ఇంజినీరింగ్ మారిపోయింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హైవేలు, యాక్సెస్ కంట్రోల్ రోడ్లు, ఆటోమేటిక్ సెన్సార్ బస్సులు వస్తున్నాయి. కానీ డ్రైవర్లు మాత్రం పాత పద్ధతుల్లోనే ఉన్నారు.
అందుకే ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు కూడా ఆరు నెలలకోసారి శిక్షణా తరగతులు తప్పనిసరిచేయాలని ప్రతిపాదిస్తున్నారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వారు ఐదేళ్ల కు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. ఆ సమయంలో డ్రైవర్లు ఒకరోజు డ్రైవింగ్‌ రిఫ్రెషర్ కోర్సుకు వెళ్లిరావాలన్న నిబంధనను కచ్చితంగా అమలయ్యే చూడనుంది. గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ స్కూల్‌లో ఈ ఒక్కరోజు శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని చూపించడంతో పాటు అది ఎప్పుడు, ఎక్కడ అనే స్పష్టమైన సమాచారం ఉంటేన రవాణా అధికారులు రెన్యువల్‌ చేసేస్తారు. ఇప్పటి వరకు ఇదో తంతుగా మాత్రమే సాగుతోంది. రవాణా శాఖ అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకపై అలా ఉండదన అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రైవేటు వాహనాలను నడిపే డ్రైవర్లు లైసెన్స్‌ తీసుకున్నాక మధ్యలో ఎటువంటి శిక్షణ, పునశ్చరణ లేకుండానే ఏళ్ల తరబడి బస్సులను నడుపుతున్నట్టు అధికారులు ఇటీవల గుర్తించారు.
కర్నూలు సమీపంలో వి.కావేరీ ట్రావెల్స్ బస్ దగ్ధమై 19 మంది సజీవ దహనం అయిన తర్వాత ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు అవకతవకలను గుర్తించారు. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా ముందు ఆర్టీసీ పై దృష్టి సారించారు.

ఆర్టీసీలో ప్రతి డ్రైవర్‌ డ్రైవింగ్‌ తీరును అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. సంబంధిత డ్రైవర్లు ఎంతకాలంగా సర్వీసులో ఉన్నారు, ఎన్ని ప్రమాదాలు చేశారు, వాటి తీవ్రత ఎంత, మైలేజ్‌ తక్కువగా వచ్చేలా డ్రైవింగ్‌ చేశారా లేదా వంటి విషయాలను పరిశీలిస్తారు. ఇందులో భాగంగా ముందు ఒక్కొక్క డిపోలో 20 మందిని ఎంపిక చేస్తారు. ఆ డిపోలో ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్‌ను సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమిస్తారు. ఆయనకు ఆ 20 మంది డ్రైవింగ్‌ తీరును పరిశీలించే బాధ్యత అప్పగిస్తారు. ఆయన ఇచ్చే నివేదికను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని ఆర్టీసీ భద్రతా అధికారి ఒకరు చెప్పారు.
దూరప్రాంత సర్వీసుల్లో 55 ఏళ్ల పైబడిన వారిని, హృద్రోగం, ఇతర తీవ్రవ్యాధులు ఉన్నవారిని డ్యూటికి వేయరు. గత ఐదేళ్లలో ఒక్క ప్రమాదం కూడా చేయనివారిని ఈ బస్సుల్లో డ్యూటీకి పంపుతారు.
ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు, ఆన్‌కాల్‌ డ్రైవర్ల డ్రైవింగ్‌ తీరును సైతం ఏడాదికి ఓసారి పరిశీలిస్తారు. అవసరమైన వారికి వారం శిక్షణ ఇస్తారు.
ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లకూ శిక్షణ అవసరం..
రోడ్‌ ఇంజినీరింగ్‌లో అనేక మార్పులు వస్తున్నాయి. హైవేలతోపాటు యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేలు తదితరాలన్నీ నిర్మితమవుతున్నాయి. బస్సుల్లో కూడా అనుసంధాన టెక్నాలజీతో కూడినవి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సుల డ్రైవర్లకు కూడా ఆరు నెలలకో, కనీసం ఏడాదికోసారయినా డ్రైవర్లకు కొన్నిరోజుల శిక్షణ ఉండేలా చూడాలని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన..
జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండీషన్స్ పైన నివేదిక ఇవ్వాలని కోరింది.
టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని పేర్కొంది. రాజస్థాన్‌లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, కర్నూలు సమీపంలో ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.
రోడ్డు భద్రత అంటే కేవలం ట్రాఫిక్ పోలీసులదే కాదు, ప్రతి డ్రైవర్ బాధ్యత కూడా. ప్రభుత్వం నిబంధనలు అమలు చేయాల్సిందీ, ప్రాణాలను కాపాడేది డ్రైవర్ జాగ్రత్తే. అందువల్ల లైసెన్స్ ఉంది కాబట్టి వాహనాన్ని నడుపుతానంటే కుదరదు.
రోడ్డు మీద జరిగే ఒక్కో తప్పు ఊరంతటి ముప్పేనని అందరూ గమనించాలి.
Tags:    

Similar News