స్టాలిన్ పెట్టిన డీలిమిటేషన్ భేటీకి జనసేన ఎంపీ ఎందుకువెళ్లినట్టు?

వారం రోజుల కిందట డిలిమిటేషన్ ఊహాజనితమన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో జరుగుతున్న సమావేశానికి తన ప్రతినిధిని పంపారని తెలుస్తోంది.;

Update: 2025-03-22 06:21 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేసినా సంచలనమే. ఏ నిమిషంలో ఏమి చేస్తారో, ఆయన మదిలో ఎప్పుడు ఏమి కదులుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. వారం రోజుల కిందట డిలిమిటేషన్ అనేది ఊహాజనితమన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో జరుగుతున్న సంయుక్త కార్యాచరణ సమావేశానికి తన ప్రతినిధిని పంపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వ భాగస్వామిగా ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ శనివారం నిర్వహించనున్న డిలిమిటేషన్ పై సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) సమావేశానికి ఆయన హాజరవుతారని భావిస్తున్నారు.
అయితే కాకినాడ లోక్ సభ సభ్యుడు శ్రీనివాస్ మాత్రం తాను సమావేశంలో పాల్గొనడానికి రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాసిన ఒక లేఖను తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అందజేయడానికి చెన్నై వచ్చానన్నారు. ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరడానికి ముందు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ “ఆ లేఖలో ఏముందో నాకు తెలియదు. అది సీల్డ్ కవర్. చెన్నైకి వెళ్లాక స్టాలిన్‌ కి అందజేస్తాను,” అని అన్నారు.
అయితే డీఎంకే వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. స్టాలిన్ ఆహ్వానం మేరకు జనసేన ప్రతినిధి వచ్చారని చెబుతున్నారు. మార్చి 12న తమిళనాడు పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఈ.వి. వేల్, రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్ స్టాలిన్ తరఫున ఆహ్వాన పత్రాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓఎస్డీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు.
రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీకి కూడా స్టాలిన్ తరఫున ఆహ్వానాలు అందినా వారెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డీలిమిటేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ కేవలం ఊహాజనితమని కొట్టిపారవేశారు. అనూహ్యంగా పవన్ కల్యాణ్ మాత్రం తన ప్రతినిధి ద్వారా తన లేఖను పంపించారు. “రాష్ట్రం హిందీకి వ్యతిరేకంగా ఉంటే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం ఎందుకు?” అని ప్రశ్నించినప్పటి నుంచీ వారం రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరుగుతున్న ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి. కె. శివకుమార్, బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు.
Tags:    

Similar News