వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌతమ్‌రెడ్డిపై రౌడీషీట్‌ ఎందుకు క్లోజ్‌ చేశారు

ఓ స్థలం కబ్జా విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌతమ్‌రెడ్డి మీద విజయవాడలో పోలీసు కేసు నమోదుచేశారు.

Update: 2024-11-14 11:27 GMT

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ఏపీ ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ మీద గతంలో రౌడీషీట్‌ నమోదైందని, తర్వాత దీనిని ఎందుకు క్లోజ్‌ చేశారో అనే అంశాన్ని పరిశీలిస్తామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు తెలిపారు. గౌతమ్‌రెడ్డిపై గతంలో నమోదైన కేసులన్నింటిపైన సమగ్ర విచారణ చేస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్ల రూపాయాల విలువ చేసే స్థలాన్ని కాజేసేందుకు గౌతమ్‌రెడ్డి ప్లాన్‌ చేశారన్నారు. కిరాయి హత్యకు ప్లాన్‌ చేసినట్లు తమ విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. గౌతమ్‌రెడ్డిపై హత్య కేసులతో సహా మొత్తం 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. స్థలానికి సంబంధించిన విషయంలో నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడినట్లు గౌతమ్‌రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కేసులో నలుగురు దొరికారని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిని గాలించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గుండూరి ఉమామహేశ్వరశాస్త్రి తన తల్లి పేరిట లక్మినగర్‌లో స్థలం కొని 2014లో రిజిస్టర్‌ చేశారని, ఈ స్థలాన్ని గౌతమ్‌రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరశాస్త్రి ఫిర్యాదు చేశారు. ఈ స్థలం గురించి వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా వివాదం నడుస్తోందని తెలిపారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో తన పలుకుబడిని ఉపయోగించిన గౌతమ్‌రెడ్డి విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అనంతరం మూడంతస్తుల భవన నిర్మాణానికి పూనుకున్నారు. అయితే దీనిపై 2017లో ఉమామహేశ్వరశాస్త్రి విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలాన్ని ఆక్రమించుకొని భవన నిర్మాణం చేపట్టారని సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో గౌతమ్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిర్మాణాలు ఆపాలని హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారని తెలిపారు.

Tags:    

Similar News