ఓటర్లు "బాబు ప్రతిజ్ఞను" నెరవేరుస్తారా!?

సభలో జరిగిన అవమానాన్ని భరించలేని చంద్రబాబు "సీఎం అయ్యాకే.. అసెంబ్లీలో అడుగుపెడతా" అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. మెజార్టీ సాధించి, పట్టు నిలుపుకుంటారా?

Update: 2024-05-04 13:59 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞకు సవాల్‌గా మారాయి. ఎలాగంటే..

అది 2021 నవంబర్ 19.. రాష్ట్ర శాసనసభలో "మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. " రిప్లై స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అనుమతించరా? ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ సీఎం అయ్యేవరకు సభలో అడుగుపెట్టను" అని టిడిఎల్పీ నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది.

ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. కుప్పంలో చంద్రబాబు గెలుపు తథ్యం. కానీ మెజార్టీ తగ్గడానికి ఉన్న అవకాశాలను పరిశీలకులు కొట్టివేయడం లేదు. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో నిలబడుతున్నాయి. తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఏర్పాటు దగ్గర నుంచి పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు కూటమిలో గందరగోళాన్ని సృష్టించాయి. ఇప్పటికీ ఈ అసమ్మతి సెగలు కొన్ని చోట్ల చల్లారలేదు కూడా. అంచనాలు తారుమారై కూటమి మ్యాజిక్ ఫిగర్ సాధించపోతే పరిస్థితి ఏమిటి? టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ ఏమవుతుంది? ఎలా వ్యవహరిస్తారు?

విభిన్న పరిస్థితులు

కూటమిలోని నాయకులు, అభ్యర్థులు, టికెట్ దక్కని ఆశావాహుల మధ్య సయోధ్య కుదరలేదు. అధికార వైఎస్ఆర్సిపి మాత్రం మరోసారి తమ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమనే ధీమాతో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 86 సీట్లు సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కూటమిలోని టిడిపి 144 అసెంబ్లీ స్థానాల్లో, జనసేన పార్టీ 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. సీనియర్లను పక్కన ఉంచి టిడిపి కూటమిలో కొత్తదేవుళ్లకు అవకాశం కల్పించడం వల్ల కొన్నిచోట్ల సహకారం అందడం లేదని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి నాయకులు వేసుకున్న లెక్కలు తారుమారైతే.. చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు శాసనసభకు హాజరవుతారా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితి రాకుండా ఎదురుకోవడానికి...




 


హోరాహోరీగా ప్రచారం

2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా మారాయి. బిజెపి - జనసేన - టిడిపి కూటమికి అధికారంలోకి రావడం అనేది జీవన్మరణ సమస్యగా మారింది. అధిక స్థానాల్లో పట్టు సాధించడం ద్వారా అభ్యర్థులను గెలిపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో 74 ఏళ్ల వయసులోనూ.. చంద్రబాబు చురుగ్గా ప్రచార ఘట్టాన్ని సాగిస్తున్నారు. "జగన్ అహంకారానికి- తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది" అని చంద్రబాబు.. ప్రజలు, యువతకు కర్తవ్య బోధ చేస్తున్నారు. అంతకుముందు..

అవమానాల భారం భరించలేక...

2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆరంభం నుంచి అధికారపక్ష సభ్యులు టిడిపిని, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. హద్దులు దాటిన మాటలు, చంద్రబాబు భార్య నారా భువనేశ్వరినీ వదలకుండా చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. "ఇది గౌరవ సభ కాదు. కౌరవుల సభగా మారింది" ప్రజా తీర్పుతో మళ్లీ గౌరవంగా సీఎం హోదాలో అడుగు పెడతా" అంటూ ప్రతిజ్ఞ చేసి ఆయన, మూడేళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో "అధిక సీట్లు సాధించడం ద్వారా సీఎం హోదాలో మళ్లీ శాసనసభకు వెళ్లాలి" అనేది టిడిపి చీఫ్ చంద్రబాబు పట్టుదల. ఎన్నికల్లో హోరాహోరీగా శ్రమిస్తున్న కూటమి నాయకులు, ప్రజల మన్ననలను పొందుతారా? లేదా? చంద్రబాబు నాయుడి కోరిక సాకారం అవుతుందా లేదా అనేది జూన్ 4న వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.

Tags:    

Similar News