అరకు 'రాజుల' ప్రతిభ మసకబారినట్టేనా?

హాట్ సీట్‌గా మారిన అరకు లోక్‌సభ నియోజకవర్గం. నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్న కొత్తపల్లి గీత, తనూజా రాణి. విజయం వీరిలో ఎవరిని వరిస్తుందో.

Update: 2024-04-09 13:45 GMT
Source: Twitter


ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అరకు లోక్‌సభ స్థానం మరింత కీలకంగా మారుతోంది. గిరిజన ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది రాష్ట్రమంతా హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయంగా కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చివరి రెండు ఎన్నికల్లో మాత్రం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 5,62,190 ఓట్లతో గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 67,300 ఓట్లు సాధించారు.
అరకులో కాంగ్రెస్ హవా
అరకు నియోజకవర్గంలో ఎక్కువగా కాంగ్రెస్‌దే హవా నడిచింది. తొలిసారి 1952లో బొబ్బిలి లోక్‌సభ(ప్రస్తుతం అరకు) ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్ రామశేషయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1957లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డిప్పల సూరి దొర గెలిచారు. 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిడ్డిక సత్యనారాయణ విజయం సాధించారు. ఆ తర్వాత 1967 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వాసరాయి నరసింహారావు గెలిచారు.
1971లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్ జెండా ఎగరేశారు. 1977, 1980, 1984 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కిషోర్ చంద్ర దేవ్ పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ చేశారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. కాంగ్రెస్ తరపు అరకు ఎన్నికల బరిలో నిలబడిన శత్రుచర్ల విజయరామరాజు గెలిచారు. 1991 ఎన్నికల్లో కూడా రామరాజు తన గెలుపును కొనసాగించారు.
1996లో కాంగ్రెస్ మరోసారి తన అభ్యర్థిని మార్చి రామరాజు స్థానంలో ప్రదీప్ కుమార్ దేవ్ వైరిచెర్లను పోటీలో నిలబెట్టింది. ఆయన కూడా ఎన్నికల బరిలో విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో అంటే 1998లో శత్రుచర్ల విజయరామరాజు.. టీడీపీ అభ్యర్థిగా అరకు ఎన్నికల్లో నిలబడి గెలిచారు. ఆ మరుసటి ఏడాదే 1999లో మరోసారి జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా దాడి చిలుక వీర గౌరి శంకరరావు పోటీ చేసి గెలిచారు.
2004లో అరకు నుంచి కాంగ్రెస్ తరపు కిషోర్ చంద్ర దేవ్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా ఆయననే విజయం వరించింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ తరపు పోటీలోకి దిగిన కొత్తపల్లి గీత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొడ్డేటి మాధవి ఎన్నికల బరిలో నిలబడ్డారు.
అయితే ఇప్పటివరకు ఈ గిరిజన నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగగా వాటిలో అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ, వైసీపీ చెరో రెండు సార్లు గెలిచాయి. త్వరలో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో బీజేపీ తరపున కొత్తపల్లి గీత, వైసీపీ తరపున తనూజ రాణి ఎన్నికల బరిలో పోటీ చేయనున్నారు.
విజయం ఎవరిది?
వీరిద్దరూ ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థిని ఎలాగైనా చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ తనూజా రాణి ప్రచారం చేస్తుంటే.. వైసీపీ ఐదేళ్లలో చేసిందేమీ లేదంటూ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ కొత్తపల్లి గీత ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో వీరి మధ్య గట్టి పోటీ సాగనుందని, కానీ ఇప్పటికే అరకు నుంచి ఒకసారి గెలిచిన కొత్తపల్లి గీత గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మరి విశ్లేషకుల అంచనాలు ఎంత మేరకు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
మసకబారిన రాజుల ప్రతిభ
అరకు నియోజకవర్గంలో అరకు రాజుల ప్రభావం కాలక్రమేణా మసకబారుతూ వచ్చింది. తొలుత అరకు నుంచి పోటీ చేయాలంటే రాజుల అభ్యర్థులనే నిలబెట్టేవి రాజకీయ పార్టీలు. అలాంటిది కాలక్రమేణా ఇక్కడ రాజుల అభ్యర్థులకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ తర్వాత రాజుల అభ్యర్థులకు అవకాశాలే దక్కని పరిస్థితి ఏర్పడింది. 1998లో శత్రుచర్ల విజయరామరాజు తర్వాత ఇక్కడి నుంచి మరో రాజుల అభ్యర్థి పోటీ చేయలేదు. దీంతో అరకు నియోజకవర్గంలో రాజుల ప్రతిభ మసకబారినట్లే కనిపిస్తోంది. విశ్లేషకులు కూడా ఇక్కడి నుంచి రాజుల అభ్యర్థుల పోటీపై స్పందిస్తూ వారి ప్రతిభ నిజంగానే మసకబారిందని అంటున్నారు.


Tags:    

Similar News