‘వైసీపీ హయాంలో తప్పు చేయాలంటే భయపడ్డారు’.. మహిళల భద్రతపై రోజా

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నేరాలు చేసేవారికి కొమ్ములు వచ్చాయంటూ ఏపీలో మహిళల భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-31 12:18 GMT

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నేరాలు చేసేవారికి కొమ్ములు వచ్చాయంటూ ఏపీలో మహిళల భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలంటే భయపడే వాళ్లని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్లకు భద్రత కరువైందని, రోడ్డుపైకి వస్తే తిరిగి వెళ్తారో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనమని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల పరిస్థితిపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నేరస్థులకు విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. నేరస్థులకు ఇంతటి ధైర్యం తీసుకొచ్చినందుకు కూటమి సర్కార్ సిగ్గు పడాలని విమర్శలు గుప్పించారు ఈ మాజీ మంత్రి.

మహిళలకు రక్షణ ఏది?

‘‘ఆంధ్రప్రదశ్‌లో ప్రస్తుతం మహిళలకు రక్షణ ఎక్కడుంది. పనిచేసే కార్యాలయాల్లో, విద్య నేర్పించే కళాశాలల్లో, ఆఖరికి తాను పుట్టి పెరిగిన ఇంట్లో సైతం భద్రత లేదు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్థులకు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది. ఇంతటి దారుణానికి నేరస్థులు ఏమాత్రం జంకు లేకుండా పాల్పడుతున్నారనంటే ప్రభుత్వం సిగ్గు పడాలి. గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరగేలదంటూ ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో తప్పు చేయాలంటే గజగజ వణికేవారు. ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలికను హత్యాచారం చేస్తే ఈ కూటమి సర్కార్ ఏం చేసింది. వారికి న్యాయం చేయలేదు కదా కనీసం బాధితురాలి కుటుంబీకులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబుకు కానీ హోం మంత్రి వంగలపూడి అనితకు కానీ సమయం లేదు. వాళ్లు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాధితురాలి కుటుంబీకులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదు?’’ అని ప్రశ్నించారు ఆర్కే రోజా.

ద్రోహం చేసిన వారిని క్షమించరు..

అనంతరం వైసీపీలో పెరుగుతున్న వలసలపై కూడా రోజా స్పందించారు. ఈ క్రమంలోనే రోజా కూడా పార్టీ మారడానికి ఆలోచిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా స్పష్టతనిచ్చారు. ‘‘నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. 2014-2019 మధ్య కూడా చాలా మంది పార్టీ మారారు. ఇప్పుడు కూడా అదే విధంగా చాలా మంది అధికారం కోసమో, తమ స్వార్థం కోసమో పార్టీ మారుతున్నారు. అలాంటి వారి వల్ల వైఎస్ జగన్‌కు కానీ, పార్టీకి కానీ ఎటువంటి నష్టం జరగదు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు. అలాంటి వాళ్లకు ప్రజలకు తప్పకుండా బుద్ధి చెప్తారు’’ అని అన్నారు.

Tags:    

Similar News