అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి సవాల్
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ కి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి సవాల్ విసిరారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అన్నారు.;
By : The Federal
Update: 2025-02-22 08:23 GMT
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ కి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి సవాల్ విసిరారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు.. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ ఇష్టం వచ్చింది చేస్కోండి అని రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (YSRCP MLA Akepati Amarnath Reddy) సవాల్ విసిరారు. ‘‘నేను, నా కుటుంబం ఎలాంటి భూములు ఆక్రమించలేదు.. ఆక్రమించినట్లు గుర్తిస్తే ఆ భూముల ప్రభుత్వం తీసుకోవచ్చు. మా గ్రామంలో నేను నా కుటుంబం ఇళ్ళు కట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులు నాకు అందలేదు.. నేను ఎలాంటి విచారణకు హాజరుకాను.. నాపై ఆరోపణలు ఇప్పటివి కావు. కడప పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ కూడా ఆరోపించారు. నేను భూముల ఆక్రమించి ఉంటే తీసుకోమని ఏనాడో చెప్పాను’’ అంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెగేసిచెప్పారు.
అసలేం జరిగిందంటే...
వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 30 ఎకరాలకు పైగా సర్కార్ భూముల్ని కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం చినికి చినికి గాలివాన అయినట్టుగా ఆయనకు నోటీసులు ఇచ్చేదాకా వెళ్లింది. జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుతవం భూములను ఆక్రమించి ఆకేపాటి ఎస్టేట్‌పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది ఆరోపణ.
ఈ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) రాజంపేట టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బనర్సయ్య నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి భూకబ్జాలకు పాల్పడి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను సీఎంవో ఆదేశించింది.
దీంతో కలెక్టర్ శ్రీధర్ విచారణ బాధ్యతలను రాజంపేట సబ్ కలెక్టర్‌కు అప్పగించారు. రెవెన్యూ సర్వే అధికారులు విచారణ పూర్తి చేశారు.
మందపల్లి రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్లలో వందలాది ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకేపాటి ఆక్రమించుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత నివేదికను రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కలెక్టర్‌కు సమర్పించారు.
అమర్నాథ్ రెడ్డి, ఆయన భార్య జ్యోతమ్మ, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సుజన పేరుతో తప్పుడు రికార్డు సృష్టించి రిజిస్ట్రర్ చేయించుకున్నట్లు తేల్చారు. దీనిపై ఫిబ్రవరి 22న విచారణకు రావాలని ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు రాజంపేట మండలం ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్యే భూ కబ్జాలపై కలెక్టర్‌కు దళితులు ఫిర్యాదు చేశారు. బీసీలకు ఇచ్చిన కాలనీవాసులను బయటకు పంపించి ఫామ్‌హౌస్ కట్టాడని ఆరోపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపి ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు.
జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించినట్టు చెబుతుండగా ఎమ్మెల్యే మాత్రం తనకు ఎటువంటి నోటీసులు రాలేదన్నారు. విచారణకు గైర్హాజర్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.